పాకిస్థాన్ సైనికుల తూటాలకు బలైన అమరవీరుడు జవాన్ కుండలిక్ మానే (36)కు గురువారం కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని పింపల్‌గావ్ బద్రుక్ గ్రామంలో వేలాదిమంది కన్నీటి వీడ్కోలు పలికారు.
వీరుడా.. నీకు వందనం!
Published Fri, Aug 9 2013 5:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
సాక్షి, ముంబై: పాకిస్థాన్ సైనికుల తూటాలకు బలైన అమరవీరుడు జవాన్ కుండలిక్ మానే (36)కు గురువారం కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని పింపల్‌గావ్ బద్రుక్ గ్రామంలో వేలాదిమంది కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక, ప్రభుత్వ లాంఛనలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఓవైపు తీరని విషాదం మనసును తొలచి వేస్తున్నా.. మరోవైపు దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడయ్యాడన్న అభిమానం అందరి కళ్లలోనూ కనిపించింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పింపల్‌గావ్ బద్రుక్ గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు, రాజకీయ నాయకులు, ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ‘భారత్ మాతా కీ జై’, ‘అమర్ రహే.. అమర్ రహే..కుండలిక్ మానే అమర్ రహే’, ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ నినాదాలతో గ్రామ పరిసరాలు మార్మోగాయి. మానే కుటుంబీకులతోపాటు గ్రామప్రజల రోదనలు అక్కడి వారందరినీ కలచివేశాయి.
ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. మానే మృతికి సంతాప సూచకంగా స్థానిక దుకాణాలన్నీ మూతబడ్డాయి. కేబుల్ ప్రసారాలను కూడా నిలిపి వేసి ఆయనకు నివాళులు అర్పించామని పింపల్‌గావ్ వాసి ఒకరు తెలిపారు. అంత్యక్రియల ప్రదేశానికి వేలాది మంది రావడంతో పాఠశాల ఆవరణ జనసంద్రంగా మారింది. మానే త్యాగాన్ని వృథాగా పోనివ్వకూడదని, పాకిస్థాన్‌పై భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని పింపల్‌గావ్ వాసులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ‘ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు సహా గ్రామస్తులకు బుధవారం రాత్రి వరకు తెలియనివ్వలేదు.
కేవలం గాయపడ్డాడని మాత్రమే చెప్పారు’ అని ఆయన వివరించారు. మానే అంత్యక్రియలకు రాష్ట్రమంత్రులు ఆర్.ఆర్.పాటిల్, హర్షవర్ధన్ పాటిల్, హసన్ ముష్రిఫ్.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు గోపీనాథ్ ముండే వంటి ప్రముఖులు హాజరయ్యారు. జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం చేసిన దాడిలో మరాఠా రెజిమెంట్‌కు చెందిన కుండలిక్ మానేతోపాటు బీహార్‌కు చెందిన మరో నలుగురు మరణించిన విషయం విదితమే. మరణాంతరం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి పుణేకి బుధవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ విమానంలో తరలించారు. అనంతరం అక్కడి నుంచి వాహనం ద్వారా గురువారం ఉదయం కొల్హాపూర్, అనంతరం అక్కడి నుంచి పింపల్‌గావ్‌కు చేరుకుంది.
50 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు
మూడు గంటలు...
మృతదేహం కొల్హాపూర్‌కు చేరాక అక్కడే కొంతసేపు ఉంచారు. మానేకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో పింపల్‌గావ్‌కు చేరడానికి ఆలస్యమయింది. కొల్హాపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింపల్‌గావ్ వెళ్లడానికి మూడుగంటలకుపైగా సమయం పట్టింది. రోడ్డుపైనే పలువురు ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీంతో బద్రుక్ గ్రామానికి చేరుకునే సరికి చాలా సమయం పట్టింది.
కోరిక తీరకుండానే...
పాకిస్థాన్ సైన్యం దాడిలో మరణించిన కుండలిక్ మానే గ్రామంలోని పిల్లల కోసం బస్సును ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకు అవసరమైతే తన రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే డబ్బును కూడా ఖర్చు చేస్తానని చెప్పేవాడు. బస్సును ప్రారంభించముందే ఆయన శత్రుదేశ తూటాలకు బలయ్యాడు. సుమారు రెండున్నర వేల జనాభ ఉండే పింపల్‌గావ్ నుంచి పది మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరిలో ఒకరైన కుండలిక్ 18వ ఏటనే.. అంటే 1988లో మరాఠా రెజిమెంట్‌లో చేరాడు. ఆయనకు తల్లిదండ్రులతోపాటు భార్య రాజశ్రీ, పదేళ్ల కుమార్తె ఆర్తి, ఐదేళ్ల కుమారుడు అమోల్ ఉన్నారు. మానే 20 రోజుల క్రితం స్వగ్రామం నుంచి పూంచ్‌కు వెళ్లారు. గత నెలే పింపల్‌గావ్‌కు వచ్చి అందరితో గడిపారు. అదే తన చివరి పర్యటన అని ఆయన గ్రహించి ఉండకపోవచ్చు.
Advertisement
Advertisement