శాస్త్రవేత్తగా పాండియరాజన్
దర్శక, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న పాండియరాజన్ ప్రస్తుతం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. పలు చిత్రాల్లో తనదైన శైలి పండిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఈయన తాజాగా ఆయ్‌వుకొట్టం చిత్రంలో సైంటిస్టుగా అవతరించనున్నారు. ఆయన ఇద్దరు యువకులపై చేసే ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందన్నదే ఈ చిత్రం ఇతివృత్తం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అన్భరసన్. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మిస్తున్నారు. ఆయనే ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంతో సత్యశ్రీ హీరోయిన్‌గా నటించారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పాండియరాజన్ శాస్త్రవేత్తగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఆయన ఇద్దరు యువకులకు వారికే తెలియకుండా వారి మెదడులను మార్చేస్తారన్నారు. దీంతో వారు ఎలా ప్రవర్తిస్తారు? ఇది తెలిసిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? శాస్త్రవేత్త పాండియరాజన్ ఏమయ్యారు? అన్ని అంశాలను వినోదభరితంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ ‘యూ’ సర్టిఫికెట్ అందించిందని త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆనందపు దత్తువీడు చిత్రం ఫేమ్ రమేష్‌కృష్ణ సంగీతాన్ని, విన్సెంట్ శిష్యుడు ఎస్.మోహన్ ఛాయాగ్రహణం అందించారని దర్శకుడు తెలిపారు.