
పోలీసుస్టేషన్ ముందు పెంపుడు శునకం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన యజమానిని పోలీసులు పట్టుకెళ్లడాన్ని అతని పెంపుడు కుక్క తట్టుకోలేకపోయింది. సుమారు 25 కిలోమీటర్లు పోలీసు వాహనం వెంట పరుగెత్తి స్టేషన్ ముందు కాపుకాచింది. యజమాని మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా పెంపుడు కుక్కను అనాథగా వదిలేసి వెళ్లిపోవడంతో స్టేషన్ ముందే కూర్చుని యజమాని కోసం మూడువారాలుగా ఎదురుచూస్తుంది. ఈ దయనీయమైన ఘటన ఇటీవల తమిళనాడులో జరిగింది. దారి దోపిడీలు, చోరీల కేసులో చెన్నై మౌంట్ పోలీసులు రెండు వారాల క్రితం ముగ్గురిని అరెస్ట్ చేశారు.
శ్రీపెరంబుదూరుకు చెందిన అజయ్(30)పై అనుమానంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని వ్యాన్‌లోకి ఎక్కించుకోవడాన్ని గమనించిన అతడి పెంపుడు శునకం వాహనాన్ని అనుసరించింది. 12 కిలోమీటర్లు దాటిపోతున్నా శునకం వదలకుండా పరుగెత్తడాన్ని గమనించిన పోలీసులు అజయ్‌ని ప్రశ్నించగా అది తన పెంపుడు కుక్క అని చెప్పాడు. కుక్కను చూసి జాలిపడిన పోలీసులు వాహనాన్ని నిలిపి దాన్ని కూడా లోపలికి ఎక్కించుకున్నారు. విచారణ నిమిత్తం అజయ్‌ను పోలీస్‌స్టేషన్ లోనికి తీసుకెళ్లగా శునకం యజమాని కోసం బయటే వేచివుంది.
విచారణ ముగిసిన తరువాత పోలీసులు విడిచిపెట్టగానే అజయ్ తనదారిన తాను బస్సెక్కి ఇంటికి వెళ్లిపోయాడు. బయటకు పోయిన యజమాని మరలా వస్తాడని కుక్క అక్కడే కూచుండిపోయింది. కుక్క అంతటి విశ్వాసం చూపుతుండగా యజమాని అజయ్ అక్కడే వదిలేసి వెళ్లిపోవడం పోలీసులను కూడా బాధించింది. రోజులు గడుస్తున్నా స్టేషన్ ముందే గడుపుతున్న కుక్కను చూసి జాలిపడిన పోలీసులు ప్రతిరోజూ తిండిపెట్టడం ప్రారంభించారు. ఇటీవల ఆ కుక్క అనారోగ్యానికి గురికావడంతో బ్లూక్రాస్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ తరువాత కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చి యజమాని కోసం ఎదురుచూడడం ప్రారంభించడంతో పోలీసులే అక్కున చేర్చుకుని పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment