
షాకింగ్: ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం
► 11 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం
► ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు: మంత్రి కామరాజ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో పలుచోట్ల ప్లాస్టిక్ బియ్యం బైటపడగా, చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం బైటపడింది. అన్నానగర్, తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై ఆహార భద్రతాశాఖధికారులు బుధ, గురువారాల్లో ఆకస్మికంగా దాడులు చేయగా ఇడ్లీ తయారీకి ప్లాస్టిక్ పేపర్లను ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వినియోగించడం బైటపడింది. ఈ సందర్భంగా 11 కిలోల ప్లాస్టిక్ పేపరును స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని కొన్ని చిన్న, పెద్దతరహా హోటళ్లలో ఇడ్లీని ఉడకబెట్టేందుకు ప్లాస్టిక్ పేపరును వినియోగిస్తున్న అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు రెండు రోజులుగా అన్నానగర్, తేనాంపేట మండల పరిధిలోని హోటళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ఒక్క అన్నానగర్ మండలంలోనే 30కి పైగా హోటళ్లలో తనిఖీలు చేయగా కొన్ని హోటళ్ల ప్లాస్టిక్ పేపరు వాడకం బట్టబయలైంది. ఆయా హోటళ్ల నుంచి ఆరుకిలోల ప్లాస్టిక్ పేపరును స్వాధీనం చేసుకున్నారు. అలాగే తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాక్కంలో జరిపిన తనిఖీల్లో ఐదు కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, ప్లాస్టిక్ పేపర్ తయారీ సమాయంలో కలిపే రసాయనాలు ఆహారపదార్థాలతో మిళితమైతే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని అన్ని హోటళ్లలోనూ ప్రచారం చేస్తున్నామని చెప్పారు. అన్నానగర్, తేనాంపేట మండలాల్లో ప్లాస్టిక్ పేపర్ స్వాధీనం చేసుకున్న హోటళ్లవారిని హెచ్చరించి వదిలేస్తున్నాము, కఠిన చర్యలు ఏవీ తీసుకోవడం లేదని ఆయన తెలిపారు.
ప్లాస్టిక్ బియ్యంపై కఠిన చర్యలు: మంత్రి కామరాజ్
రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల మంత్రి కామరాజ్ హెచ్చరించారు. చెన్నై సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ప్లాస్టిక్ బియ్యం చలామణి అవుతున్నట్లు వార్తలు వస్తున్నా, తమిళనాడులో ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు లేవని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా అయ్యే బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ బియ్యం మార్కెట్‌లోకి రాకుండా తనిఖీలు పెంచామని, అనుమానం ఉన్నచోట్ల బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకుని పరిశీలించామని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం గనుక పట్టుబడితే నిందితునిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.