రబీలో పూర్తిస్థాయిలో నీరు
రబీలో పూర్తిస్థాయిలో నీరు
Published Tue, Sep 27 2016 2:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
వర్షాలతో రాష్ట్రమంతా జలకళ..
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాల్కొండ : రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్ట్‌ల పూర్తి ఆయకట్టుకు రబీలో నీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌లతో కలిసి ఆయన ఎస్సారెస్పీని సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రబీలో ఎలాంటి షరతులు లేకుండా ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీటిని అందిస్తామన్నారు. ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందించినట్లుగానే రబీలోనూ అన్ని రకాల విత్తనాలను ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసి వాగులు, చెరువులు తెగడం వల్ల పంటలకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన చండీయాగం ఫలితంగానే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ ఫలితాలు రైతులకు అందుతున్నాయన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్‌ఈ సత్యనారాయణ, ఆర్డీవో యాదిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
పంటల పరిశీలన
ఆర్మూర్‌అర్బన్ : రాంపూర్ గ్రామాన్ని మంత్రి పోచారం స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి సందర్శించారు. రాంపూర్‌లో చెరువు ఉప్పొంగి మత్తడి ద్వారా వచ్చిన నీటితో పంటలు నష్ట పోయిన ప్రాంతాన్ని, మాటు కాలువకు పడిన గండిని పరిశీలించారు. గండి పడిన కాలువలు, తూములు, బ్రిడ్జీలకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు శాశ్వత మరమ్మతులు చేపడతామన్నారు. ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాటు కాలువలు కొట్టుకుపోతున్నా ఇరిగేషన్ ఏ ఈ నర్సింగ్ ఒక్కసారి కూడా పరిశీలించడానికి రాలేదని రైతులు ఆరోపించారు. దీంతో ఏఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం
ఆర్మూర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. సోమవారం ఆయన మామిడిపల్లిలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. వర్షాల వల్ల రాష్ట్రంలో లక్షా 30 వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయన్నారు. అధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాక నష్టం తీవ్రత తెలుస్తుందన్నారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని 78 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 46 మైన ర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయన్నారు. చెరువుల్లోనే 5 కోట్ల 67 లక్షల హె క్టార్ల విస్తీర్ణంలో నీళ్లు నిలిచాయన్నారు. దీం తో రెండు పంటలకు నీళ్లు అందించవచ్చన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో అందరినీ అప్రమత్తం చేయడం వల్ల పెద్దగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం సంభవించలేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు ఎల్‌ఎంబీ రాజేశ్వర్, సంజయ్ సింగ్ బబ్లూ, రాజబాబు, శ్రీనివాస్, నర్సయ్య, రమాకాంత్, రమేశ్, గంగార్, గంగారెడ్డి, పండిత్ ప్రేమ్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement