కోర్టుకు హాజరైన ప్రముఖ నటి
బొమ్మనహల్లి(కర్ణాటక): చెక్కు బౌన్స్ కేసులో ప్రముఖ నటి పూజా గాంధీ శుక్రవారం ఇక్కడి 16వ ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు. కొద్ది నెలల క్రితం స్వీయ నిర్మాణంలో ఆమె ‘ముత్తులక్ష్మి’ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఫైనాన్స్ వ్యాపారి విజయ్ కుమార్ నుంచి 4 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత రూ. 4 కోట్లకు చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. గతంలో పలుమార్లు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు శుక్రవారం తండ్రి పవన్ గాంధీతో కలిసి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
కన్నడ, తమిళం, బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాల్లో పూజా గాంధీ నటించారు. 2012లో రాజకీయ ప్రవేశం చేశారు. మొదట్లో జేడీఎస్ చేరిన ఆమె తర్వాత కేజేపీలోకి మారారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.