చెన్నై, సాక్షి ప్రతినిధి: కొలిక్కిరాని కూటమి కోసం భారతీయ జనతా పార్టీ రాయబారం ప్రారంభించింది. తమిళపార్టీలతో రాజకీయ మంతనాలు సాగించేందుకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం చె న్నై చేరుకున్నారు. రెండురోజులపాటు ఆయన ఇక్కడే మకాం వేసి కూటమి ఖరారు చేస్తారని అంచనా. ఎన్నికల నోటిఫికేషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్లుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ ఖాయమని తెలుస్తోంది. నోటిఫికేషన్ వెలువడిందే తడవుగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలతో పార్టీ క్యాడర్‌ను పరుగులెత్తించాలి.
దక్షిణాదిలో బలం పుంజుకోవావలని ఆశిస్తున్న బీజేపీ అధినాయకత్వం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులేకుంటే రాష్ట్రంలో మనుగడ ఉండదని కాంగ్రెస్ పార్టీ ఐదు దశాబ్దాల కిందటే అనుభవంతో తెలుసుకుంది. అన్నాడీఎంకే, డీఎంకేలతో పొత్తపెట్టుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. ఇపుడు అదే రీతిలో మరో జాతీయ పార్టీ బీజేపీ వంతు వచ్చింది. కమలనాధులు సైతం కాంగ్రెస్ అనుభవంతో అందలం ఎక్కాలని ఆశిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే పార్లమెంటు ఎన్నికల్లో బలమైన కూటమిని కూడగట్టుకోగలిగిన బీజేపీ నేడు అధికారంలో ఉండికూడా విఫలమవుతోంది.
ఆనాటి కూటమి చిన్నాభిన్నం కాగా ఒక్క డీఎండీకేపై మాత్రమే అశలు పెట్టుకుంది. డీఎంకే సైతం డీఎండీకే కోసం వలవిసిరి ఉంది. విజయకాంత్ తమతో రావాలేగానీ అన్ని త్యాగాలకు సిద్దమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆఫర్ ఇచ్చాడు. విజయకాంత్ తమతో చేతులు కలుపుతాడనే విశ్వాసంతోనే ఉన్నారు. అలాగే ప్రజా కూటమి నేతలు సైతం విజయకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. తన మద్దతులో మరెవరో సీఎం పీఠం ఎక్కడం కాదు, తానే సీఎంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించుకున్న నేపథ్యంలో డీఎంకేతో పొసగకపోవచ్చు.
అన్నాడీఎంకే వైపు అవకాశాలు
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖాయమని ఏడాదిగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం జయలలిత ప్రభుత్వానికి అనేక విషయాల్లో సానుకూలంగా వ్యవహరిస్తోంది. జయను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ శనివారం మధురైలో మీడియాతో మాట్లాడుతూ, బలమైన కూటమి ఏర్పడటం ఖాయమని మాత్రమే వ్యాఖ్యానించారు.
పలు పార్టీలతో జవదేకర్
పార్లమెంటు ఎన్నికల్లో ఏర్పడిన కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండిన డీఎండీకే, పీఎంకేలతో పొత్తు ఖరారుకు కేంద్ర మంత్రి జవదేకర్ ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళనాడు కూటమి ఇన్‌చార్జ్‌లుగా కేంద్రమంత్రులు జవదేకర్, పీయూష్‌గోల్‌ను పార్టీ నియమించింది. ఈ బాధ్యతల నేపధ్యంలో శనివారం సాయంత్రం జవదేకర్ చెన్నైకి చేరుకున్నారు. రెండు రోజుల పాటూ చెన్నైలోనే ఉండి కమల కూటమి ఖరారు చేస్తారని అంచనాగా ఉంది.
శనివారం సాయంత్రం చెన్నైకి చేరుకున్న జవదేకర్ శని, అదివారాల్లో డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు శరత్‌కుమార్‌లతో చర్చలు జరుపుతారు. ఆదివారం సాయంత్రం పార్టీ సమావేశం నిర్వహించి రాత్రికి డిల్లీకి వెళ్లిపోతారు. డీఎండీకే నేత నేతృత్వంలోనే కూటమి ఏర్పడాలి, తనను సీఎం అభ్యర్దిగా ప్రకటించాలని విజయకాంత్ బీజేపీకి షరతులు విధించారు. ఇందుకు అంగీకరిస్తేనే బీజేపీతో చర్చలని విజయకాంత్ భీష్మించకుని ఉన్నారు. కెప్టెన్ వైఖరితో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది కూటమిని కొలిక్కితేచ్చేందుకు జవదేకర్ రంగంలోకి దిగారు.
సీఎం జయను కలుస్తారా
అన్నాడీఎంకేతో పొత్తు అవకాశాలను కొట్టిపారేయలేమని బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్న తరుణంలో ఢిల్లీ దూతగా చెన్నైకి వచ్చిన జవదేకర్ సీఎం జయలలితను కలుస్తారా అనే చర్చ రాష్ట్రంలో ప్రధానంగా సాగుతోంది. బీజేపీ ప్రభుత్వం నుండి ఎవరు చెన్నైకి వచ్చినా జయను కలవడం ఆనవాయితీగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ ఇంటికి వెళ్లి మరీ కలుసుకున్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పట్టణాభవృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సైతం కలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పొత్తు చర్చలు వంటి కీలక తరుణంలో జవదేకర్ సీఎం జయలలితను కలిసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే బీజేపీ సాగిస్తున్న కూటమి ప్రయత్నాల్లో భిన్నధృవాలైన అన్నాడీఎంకే, డీఎండీకేతో ఒకేసారి చర్చలకు దిగుతుందా అనేది ప్రశ్నర్థకంగా మారింది.
చెన్నైలో బీజేపీ కేంద్ర మంత్రి జవదేకర్
Published Sun, Feb 28 2016 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement