దేశంలో రెండు టైమ్‌జోన్లు!
న్యూఢిల్లీ: దేశంలో రెండు వేర్వేరు టైమ్‌జోన్ల అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో తెలిపింది. బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ ఈ విషయాన్ని సభలో లేవనెత్తుతూ దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉందన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 4 గంటలకు సూర్యోదయమైతే కార్యాలయాలు 10 గంటలకు తెరుచుకుంటున్నాయి. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ దీనిపై గతంలో అధ్యయనం కూడా జరిపింది’ అని వెల్లడించారు.
దేశంలో రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనివేళలపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం–పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుందని తెలిపారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ స్పందిస్తూ.. మెహతబ్ సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని తెలిపారు.