
చెప్పుకోలేకపోతున్నాం
- పనులు జాస్తి.. ప్రచారం నాస్తి
- అన్నింటా విప్లవాలే.. అయినా రిక్త హస్తమే
- కాంగ్రెస్ ప్రచార ధోరణిపై రాహుల్ పెదవి విరుపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :‘ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చింది. సాంకేతిక, సామాజిక ఆర్థిక విప్లవాలూ తీసుకొచ్చింది. అయినా వీటిని ప్రచారం చేసుకోవడంలో వెనుకబడింది. ఈ విద్యలో ప్రతిపక్షాలే ఉత్తమం. మేం బాగా చెప్పలేక పోతున్నాం’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ రూపొందించే మేనిఫెస్టోలో యువత, విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై ఇక్కడి ప్యాలెస్ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువ డాక్టరు బసంతి తన అభిప్రాయాన్ని చెబుతూ, ‘రాజకీయాల్లో మాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. సహాయం కాదు’ అని పేర్కొన్నారు. ఝార్ఖండ్‌కు చెందిన యాసిడ్ దాడి బాధితురాలు సోనాలి చెప్పిన మాటలు అందరి మనసులను కలచి వేశాయి. ‘మేం ప్రతి రోజూ చచ్చిపోతున్నాం. యాసిడ్ దాడి బాధితులు జీవచ్చవాలతో సమానం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఈ సంప్రదింపుల స్ఫూర్తితో...యాసిడ్ దాడి బాధితులకు పునరావాసం కల్పించడానికి పలు సూచనలు చేశారు. వారికి నష్ట పరిహారం చెల్లించడంతో పాటు దాడి వెనుక ఉన్న వారికి శిక్ష పడడానికి కేసుల దర్యాప్తును వేగంగా ముగించాలని కోరారు.
జమ్ము-కాశ్మీర్‌కు చెందిన ఓ యువ పంచాయతీ అధికారి తమ రాష్ట్రంలోని అసమానతలను ఏకరువు పెట్టారు. మధ్యప్రదేశ్‌లో ఖనిజ సంపద ప్రాంతమైన సింగ్రౌలికి చెందిన ఓ సామాజిక కార్యకర్త మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ కంపెనీలు సమకూరుస్తున్న నిధులను నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపైృదష్టి పెట్టాలన్నారు. ఇలా... కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులు తమ అభిప్రాయాలను సుదీర్ఘంగా వివరించ సాగారు. మూడు విభాగాలుగా ఆరు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. తొలి సభలో విద్య, పరికల్పన, నైపుణ్య అభివృద్ధిపై సంప్రదింపులు జరిగాయి.
ఇందులో కేంద్ర కార్పొరెట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ పాల్గొన్నారు. రెండో సభలో ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపనపై అభిప్రాయ సేకరణ జరిగింది. దీనికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ సారథ్యం వహించారు.
రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన మూడో సభలో ‘రాజకీయ ఖాళీల భర్తీ, కొత్త ఇండియా నిర్మాణం’ అనే అశంపై చర్చించారు. కాగా మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియలో ఇదో మూడు సమావేశం. ఢిల్లీలో గత నెల 13న అట్టడుగు వర్గాల సాధికారత, 23న మైనారిటీల సాధికారత అనే అంశాలపై చర్చించి, అభిప్రాయాలను సేకరించారు.