
ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మి
కథానాయికలు ఐటమ్ సాంగ్స్ చేయడంలో కొత్తేమీ లేదు. కాజల్, శ్రుతిహాసన్, తమన్న లాంటి ప్రముఖ నాయికలే సింగిల్ సాంగ్స్‌కు ఓకే అంటున్నారు. అయితే రాయ్‌లక్ష్మి నూతన తారలు నటిస్తున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ కు చిందేయడం విశేషం. ఈ సంచలన తార ఇంతకుముందు కొన్ని చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో ఆడింది. ఆ మధ్య తెలుగులో రవితేజ హీరోగా నటించిన పవర్ చిత్రంలో రాయ్‌లక్ష్మి ఐటమ్‌సాంగ్‌లో అదరగొట్టేసింది. తాజాగా తమిళంలో ప్రముఖ నృత్య దర్శకుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్న ఒరు టికెట్టుల రెండు సినిమా చిత్రంలో వైవిధ్యపాత్రలో నటిస్తోంది. అదే విధంగా కాదల్ పండిగై అనే చిత్రంలో ఈ బ్యూటి ప్రత్యేక గీతంలో నటించనుందట.
విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లలతో సహా అందరూ నూతన తారలే నటిస్తున్నారట. నూతన దర్శకుడు నవమణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. చిత్రంలో అందరూ కొత్తవారు నటిస్తుండంతో రాయ్‌లక్ష్మి లాంటి పాపులర్ నటి ప్రత్యేక గీతంలో ఆడితే చిత్రానికి కమర్షియల్ లుక్ వస్తుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. పాట, పారితోషికం తదితర అంశాలు నచ్చడంతో రాయ్ లక్ష్మి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గ్లామర్ విషయంలో దుమ్ము రేపే అమ్మడు ఈ చిత్రంలో ఒంటినిండా చీరతో చిందులేయనుందట. ఇది ఉత్సవ పాట కావడంతో రాయ్‌లక్ష్మి చీర సింగారంతో ఆడనున్నారని సమాచారం.