కేంద్రమంత్రి కొడుకుపై రేప్ కేసు
బెంగళూరు : కేంద్ర రైల్వేమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడ రేప్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో కార్తీక్ గౌడపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక అనంతరం కార్తీక్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మైత్రేయి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో కుషాల్ అనే స్నేహితుని ద్వారా కార్తీక్ గౌడ పరిచయమయ్యాడని, అనంతరం జూన్ 5న మంగళూరులోని తన ఇంటికి కార్తీక్ గౌడ పిలుచుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. పెళ్లికి ముందు ఇలాంటివి తనకు ఇష్టం లేదని చెప్పడంతో అప్పటికప్పడు ఓ పసుపుతాడును మెడలో కట్టాడని తెలిపింది.
అప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి తిరిగేవాళ్లమని, అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో జూలై 25 నుంచి మాట్లాడడం కూడా మానేశాడని వాపోయింది. చివరకు ఈ విషయాన్ని అతని తల్లి దృష్టికి ఈ నెల 11న తీసుకెళ్లానని, అప్పట్లో ఆమె సైతం తనను బెదిరించి పంపినట్లు తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో అతడికి నిశ్చితార్థం చేస్తున్నారని, తనను పెళ్లి చేసుకుని ఇలా మోసం చేయడం తగదని ఆమె అంటోంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం రోజున ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మైత్రేయికి అన్యాయమే జరిగి ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా కార్తీక్ గౌడపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది.
కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆమె ఆర్‌టీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మైత్రేయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కార్తీక్ గౌడ కూడా మైత్రేయి ఆరోపణలను తోసిపుచ్చాడు. తన తండ్రి ఉన్నతమైన వ్యక్తి అని, వివాదాల్లోకి లాగడం మంచిది కాదని వ్యాఖ్యానించాడు. తనకు అంత తీరిక కూడా లేదని, తన పనుల్లో తాను బిజీగా ఉన్నానని చెప్పాడు.