శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదలచేస్తూ ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీచేసింది. యాల్పనంలో ఉన్న 30 మందిని, తలైమన్నార్‌లోని మరో 82 మందిని బుధవారం శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయ అధికారులకు అప్పగించనున్నారు. జాలర్లను విడుదల చేసినా రాష్ట్రంలోని జాలర్ల సంఘాలు మాత్రం వెనక్కు తగ్గడంలేదు. దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట లక్ష్యంగా భారీ నిరసనకు సిద్ధమయ్యూయి.
సాక్షి, చెన్నై:రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వాలు మారినా తమ తల రాతలు ఇంతేనా?... అన్నట్టుగా జాలర్ల పరిస్థితి మారింది. వరుస దాడులతో ఆగ్రహానికి లోనైన జాలర్ల సంఘాలు రామేశ్వరం, పాంబన్‌లలో సమ్మెను ఉధృతం చేశాయి. ఈ నేపథ్యం లో రాష్ట్రంలోని జాలర్లందరూ ఏకమవుతున్నారు. మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం వారి విడుదల లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచింది. రాష్ట్రంలోని కమలనాథులు సైతం ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత దౌత్యాధికారులు ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. జాలర్లను విడుదల చేయాలంటూ ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే ఆదేశించారు.
విడుదల:
శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సే ట్విటర్ ద్వారా జాలర్ల విడుదలకు ఆదేశమిచ్చారు. దీంతో ఆ దేశ నావికాదళం అధికారులు అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. యాల్పానం చెరలో ఉన్న 30 మందిని విడుదల చేసే విధంగా అక్కడి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారిని విడుదల చేస్తూ కోర్టు ఆదేశించింది. అలాగే తలైమన్నార్ చెరలో ఉన్న మరో 82 మందిని విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీరందర్నీ జైలు నుంచి విడుదల చేయడానికి సాయంత్రమైంది. వీరిని బుధవారం భారత దౌత్య కార్యాలయ అధికాారులకు అప్పగించనున్నారు. అదే రోజు వీరిని భారత సరిహద్దుల్లో కోస్ట్ గార్డుకు అప్పగిస్తారు. జాలర్లు శుక్రవారం ఉదయానికి రాష్ట్రానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
వెనక్కు తగ్గని సంఘాలు
తమ వాళ్లను విడుదల చేసినా జాలర్ల సంఘాలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తమ జాలర్ల పడవల్ని శ్రీలంక తమ ఆధీనంలో ఉంచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ వాళ్లతోపాటుగా పడవల్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సమ్మె ఉధృతం చేసిన జాలర్లు బుధవారం నల్ల గుడ్డను నోటికి కట్టుకుని రామేశ్వరంలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. అలాగే అక్కడి మత్స్యశాఖ కార్యాలయం ముట్టడికి నిర్ణయించారు. ఇక జాలర్లపై దాడులు పార్లమెంట్, రాజ్యసభల్లో సైతం మర్మోగడం విశేషం. అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత తంబిదురై, రాజ్యసభ నేత మైత్రేయన్‌లు తమ ప్రసంగాల్లో శ్రీలంక చర్యల్ని తీవ్రంగా ఖండించారు. దాడులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయించాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చెర వీడింది..
Published Wed, Jun 11 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM
Advertisement
Advertisement