పుట్టిన రోజున అభిమానులతో భేటీ
డిసెంబర్ 12కు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. ఆ రోజు కోసం ఆయన కంటే తన అభిమానులే ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. కారణం తమ తలైవా (నాయకుడు) ఏమైనా విశేష వ్యాఖ్యలు చేస్తారేమోనని. ఇక రజనీ కాంత్ అభిమానుల ఆకాంక్ష ఏమిట న్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది తమిళనాడుకే తెలిసి న విషయం. కాగా రజనీకాంత్ ఇంతకుముందు ప్రతి ఏడాదీ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న తన అభిమానులను రప్పించి వారితో ముచ్చటించేవారు. 1996 తరువాత ఆ ఆనవాయితీని కొనసాగించడం లేదు. అందుకు తగిన కార ణం లేకపోలేదు. అప్పట్లో రాజకీయ చర్చ పెద్దదుమారం లేపింది. ఒక తరుణంలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం తథ్యం అనే ప్రచారం వేడి పుట్టించింది.
ఆ దేవుడు ఆశిస్తే ఈ రజనీ పాటిస్తాడు అన్న రజనీకాంత్ వ్యాఖ్య సంచలనం సృష్టించింది. కొన్ని రాజకీయ పార్టీలను కలవరపెట్టింది. ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరం అంటూ వచ్చారు. తమ భావాలను పంచుకోవాలని ఆయన అభిమానగణం వరుసగా లేఖలు రాయడం మొదలెట్టింది. వారి కోరిక మేరకు 2006లో స్థానిక కోడంబాక్కంలోని రాఘవేంద్రస్వామి మండపంలో రజనీ అభిమానులను కలుసుకుని వారి ప్రశ్నలకు సమయోచితంగా బదులిచ్చారు. వారితో ఫొటోలు దిగి వారిలో సంతోషాన్ని నింపారు. ఆ తరువాత 2011లో స్థానిక రాయపేటలోని వైఎంసీ గ్రౌండులో మరోసారి అభిమానులను కలుసుకున్నారు. ఈ మధ్య కోచ్చడయాన్ చిత్రం విడుదల సమయంలో అభిమానులను కలుసుకోవాలని భావించినా చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
అలాంటిది ఈ పుట్టిన రోజు నాడు రజనీఅభిమానులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదేరోజు ఆయన నటిస్తున్న లింగా చిత్రం తెరపైకి రానుంది. మరో విషయం ఏమిటంటే తాజాగా రజనీ పేరు రాజకీయాల్లో వేడి పుట్టిం చడం మొదలైంది. బీజేపీ రజనీని పార్టీలోకి లాగాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆశ చూపుతోంది. ఈ ప్రకంపనలు అభిమానులకు చేరుతున్నాయి. మరి వారి ఒత్తిడి రజనీ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందో వేచి చూడాల్సిందే.