
ఆర్బీఐ వాస్తవాలు చెప్పాలి: ఏపీటీబీఈఎఫ్
హైదరాబాద్: నోట్ల కష్టాలు ఇప్పట్లో తొలగే అవకాశాలు లేవని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏపీటీబీఈఎఫ్) తెలిపింది. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) అవలంభిస్తోన్న విధానాలు తప్పుల తడకగా ఉన్నాయని మండి పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 నెలల పాటు జీతాల చెల్లింపు కష్టమేనని ఏపీటీబీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. దేశంలోని ముద్రణాలయాలు పూర్తిస్థాయిలో పనిచేసిన నోట్ల కొరత తీరదని తెలిపారు.
అరకొరగా ప్రకటిస్తున్న చర్యలు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడం లేదని చెప్పారు. నగదు కొరత కారణంగా బ్యాంకు ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోయారు. ఆర్బీఐ ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 500 నోట్లు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. 15 రోజుల నుంచి నగదు సరఫరా చేస్తుందని వేచి చూసినా ఫలితం లేకపోవడంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని రాంబాబు చెప్పారు. పాత నోట్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు బ్యాంకులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.