
ముంబై: నేటి తరం ఆలోచనలు కాస్త వింతగానే ఉంటున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడు రూపొందించిన యాప్ కూడా అలాంటిందే. భారత్‌లో తొలిసారిగా ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ (అద్దెకు స్నేహితుడు) పేరుతో కౌశిక్ ప్రకాశ్ ఈ యాప్‌ను తీసుకువచ్చారు. వినడానికి కాస్త అదోలా ఉన్న.. ఇది మంచి సేవలనే అందజేస్తుందని కౌశిక్ అంటున్నారు. కొన్ని దేశాల్లో ఈ విధానం ఆచరణలో ఉంది. కానీ భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదు. ఒంటరి జీవితం గడిపే మహిళలకు, ఒత్తిడితో సతమతవుతున్నవారి జీవితాలకు భరోసా ఇచ్చేందుకు ఈ యాప్‌ను తీసుకువచ్చారు. ఇది శృంగారానికి సంబంధించిన యాప్ కాదు. పైగా అందరు పురుషులు ఇందులో సభ్యులుగా చేరలేరు. దీనికోసం కొన్ని పరీక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మాటతీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్, అతని శారీరక, మానసిక స్థితిగతులను పూర్తిగా పరీక్షించిన తరువాతే అతడిని ఎంపిక చేస్తారు.
అలాగే ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకు సంబంధించిన వివరాలు కూడా ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా మహిళలు యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న అద్దెకు స్నేహితులు 3 నుంచి 4 గంటలపాటు వారితో ఉంటుంటారు. వీరికి గంటకు ఇంతా అని చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు వచ్చే స్నేహితుడి ఖర్చు మహిళలే చెల్లించాలి. ఒకవేళ ఎక్కువ సమయం కావాలనుకుంటే ముందుగానే యాప్లో తెలియజేయాల్సి ఉంటుంది. స్నేహితుడిగా ఉండాలనుకున్న వ్యక్తి సదరు మహిళను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయాలి.. అంతేకాని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ఒంటరితనంతో బాధపడుతున్న మహిళలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.