తొమ్మిదో అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి!
హైదరాబాద్: ఐఎస్‌బీకి చెందిన ఓ పరిశోధక విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చైతన్య బయాన్‌వాలా(26) ఐఎస్‌బీలో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి. చైతన్య గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్ అపార్ట్‌మెంట్లో 12వ బ్లాక్‌లో నివాసం ఉండేవాడు. అయితే శనివారం రాత్రి దాదాపు పదిన్నర గంటల సమయంలో తొమ్మిదవ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. చైతన్య రూమ్‌మేట్స్ అయిన స్వప్నిల్, పియూష్ రాత్రి 10 గంటలకు షాపింగ్ చేయడానికి బయటకు వెళ్లారు. కొద్ది సమయం తర్వాత అపార్ట్‌మెంట్‌కు రాగానే జరిగిన విషయాన్ని ఇతర ఫ్లాట్ వాళ్లు తమకు చెప్పారని తెలిపారు.
తీవ్రంగా గాయపడ్డ చైతన్య బయాన్‌వాలాను చికిత్స నిమిత్తం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చైతన్య అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత మృతదేహాన్ని అతడి బంధువులకు అప్పగించారని సమాచారం. ఈ ఘటనపై చైతన్య రూమ్‌మేట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.