
డబ్బుతో పట్టుబడ్డ హీరో
ట్యుటికొరిన్: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ శనివారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న డబ్బుతో పట్టుబడ్డారు. 'ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి' అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాఏడీఎంకేతో పొత్తుతో తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
తాను పోటీచేస్తున్న నియోజకవర్గానికి సమీపంలోనే ఎన్నికల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆయన కారులో 9 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. ఈ డబ్బుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించడంలో శరత్ కుమార్ విఫలమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ట్రెజరీలో డిపాజిట్ చేసినట్లు వారు వెల్లడించారు. మే 16న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 80 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు నేరుగా ఇలా డబ్బుతో పట్టుబడటం మాత్రం ఇదే తొలిసారి. హీరోయిన్ రాధిక భర్త అయిన శరత్ కుమార్.. ఇలా పట్టుబడ్డారు గానీ, తమిళనాడు ఎన్నికల్లో భారీ మొత్తంలో ధన ప్రవాహం సాగుతోందని జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. పట్టుబడింది ఆవగింజలో ఆరోవంతేనని, ఇంకా చాలా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని చెబుతున్నారు.