ఆరోపణలు నన్నెంతో బాధించాయి:శరత్ కుమార్
చెన్నై: ఎస్‌పీఐ సంస్థతో చేసుకున్న నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందాన్ని సెప్టెంబర్ 29 వ తేదీనే రద్దు చేసినట్టు సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ ప్రకటించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి వెలువడిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పాండవర్ జట్టు ఘన విజయం సాధించింది. అపజయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నట్లు శరత్‌కుమార్ జట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నటుడు శరత్‌కుమార్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో నిర్మాణ ఒప్పందం రద్దు పత్రాన్ని మీడియాకు చూపించారు.
తనపై సదాభిప్రాయం ఉండడం వల్లే ఎస్‌పీఐ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయడానికి అంగీకరించిందన్నారు. ఈ విషయంలోనే తనపై ప్రత్యర్థులు పలు ఆరోపణలు చేశారనీ, అవన్నీ నిరాధారమని, ఒప్పందం రద్దుతో ఈ విషయం నిరూపణ అయిందని అన్నారు. అయితే ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పంద రద్దు పత్రాలను కొత్త కార్యవర్గానికి అందిస్తానని చెప్పారు. తనకు గౌరవ పదవులను ఇస్తానంటే అంగీకరించనని, గత 30 ఏళ్లుగా నడిగర్ సంఘానికి వివిధ రకాలుగా సేవలు అందించానని అన్నారు. వారు కోరితే ఇకపై కూడా తన సేవలు కొనసాగుతాయని చెప్పారు.
నడిగర్ సంఘం ప్రాంగణంలో నాజర్, విశాల్
ఇదిలా ఉండగా, నడిగర్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాజర్, విశాల్ తదితరులు హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం స్థలాన్ని సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. నడిగర్ సంఘం పేరు మార్చాలన్న కోర్కెపై మీడియా అడిగిన ప్రశ్నకు సంఘం అధ్యక్షుడు నాజర్ సమాధానం ఇస్తూ, ఎన్నికలు ముగిసి ఒక్కరోజు కూడా ముగియలేదు, మరుసటి రోజునే పేరును మార్చలేం కదా అని వ్యాఖ్యానించారు.
శరత్‌కుమార్ మీడియా సమావేశంపై విశాల్ స్పందిస్తూ, నడిగర్ సంఘం భవనానికి సంబంధించిన ఒప్పందం రద్దు పత్రాన్ని పరిశీలించిన తరువాతనే వ్యాఖ్యానిస్తానని అన్నారు. అయినా ఒప్పందం పత్రం రద్దు గురించి సర్వసభ్య సమావేశంలో శరత్‌కుమార్ ప్రకటించాల్సి ఉంటుందని విశాల్ అన్నారు. సీనియర్ నటి సచ్చు తదితరులకు శాశ్వత సభ్యత్వ పత్రాలను అందించారు.
కరుణ శుభాకాంక్షలు
నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన పాండవర్ జట్టుకు డీఎంకే అధినేత కరుణానిధి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో తలెత్తిన విభేధాలను విడిచి సంఘం సంక్షేమానికి పాడుపడాలని ఆయన కోరారు.