
నేటి నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు
చెన్నూర్ నుంచి సిరోంచకు ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం ట్రయల్ రన్
చెన్నూర్: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాక పోకలు ప్రారంభంకానున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నుంచి కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో బస్సును ఆదివారం నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. శనివారం చెన్నూర్ నుంచి కాళేశ్వరం మీదు గా సిరోంచ వరకు కిలో మీటర్ల సర్వే కోసం ఆర్టీసీ అధికారులు ట్రయల్ ట్రిప్పును ప్రారంభించారు. కాళేశ్వరం గోదావరి నదిపై నిర్మించిన వంతెన ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలకు సులభతరం చేసే క్రమంలో అధికారులు ఈ మేరకు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులను చెన్నూర్ బస్టాండ్ నుంచి, పలుగుల, కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రలోని సిరోంచ వరకు ఆర్టీసీ బస్సును నడిపించేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం మీదుగా సిరోంచకు ఆర్టీసీ బస్సులను ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డీఎం పీఆర్ కృష్ణ తెలిపారు. చెన్నూరు నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు ప్రస్తుతం తాత్కాలిక వంతెన మాత్రమే ఉంది. గతంలో మంచిర్యాల ప్రజలు సిరోంచకు వెళ్లాలంటే కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాం తంలోగల ప్రాణహిత నదిపై పడవల ద్వారా ప్రయాణం చేసేవారు. ప్రాణహితపై వంతెన కోసం రూ. 126 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.