విక్రమ్ ప్రభుతో శాండిల్ ఉడ్ బ్యూటీ
సినిమా అనే మహా ప్రపంచంలో కొత్త నీరు రాక, పాత నీరు పోక సర్వసాధారణం. అయితే ఇక్కడ అరుదెంచిన అందరూ నిలదొక్కుకుంటారని చెప్పలేము. అందుకు అందం, అభినయం ఉన్నా సరిపోదు. అదృష్టం తోడవ్వాలి. అలా తన లక్కును పరీక్షించుకోవడానికి మరో శాండిల్ ఉడ్ బ్యూటీ కోలీవుడ్‌లో ప్రవేశించారన్నది తాజా సమాచారం. ఈ భామ పేరు రన్యారావు. యువ నటుడు విక్రమ్ ప్రభుతో రొమాన్స్‌తో ఇక్కడ తన కెరీర్‌ను ప్రారంభించింది. మలయాళకుట్టి కీర్తిసురేష్‌తో డ్యూయెట్లు పాడి ఇదు ఎన్న మాయం చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్ ప్రభు వాగా చిత్రానికి సిద్ధమయ్యారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి జిఎన్‌ఆర్ కుమరవేలన్ దర్శకుడు.
ఇప్పటికే పది రోజులు షూటింగ్‌తో తొలి షెడ్యూల్‌ను కుంభకోణంలో పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం కాశ్మీర్, ఊటికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచిన యూనిట్ వర్గాలు దక్షిణాదికి చెందిన ప్రెష్ నటిని పరిచయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆ దక్షిణాది అమ్మాయి శాండిల్‌ఉడ్‌కు చెందిన రన్యారావు అన్నది తాజా సమాచారం. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ అమ్మడు ఒక కన్నడ చిత్రంలో సుదీప్ సరసన నటించారట. కాగా విక్రమ్ ప్రభు వాగాతో మరో హీరోయిన్ ఉంటుందట. ఆమె ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు.