శింబు సినిమాకి బ్రేక్
చెన్నై: సంచలన నటుడు శింబు చిత్రాలు ఈ మధ్య వివాదాలకు, సమస్యలకు కేరాఫ్‌గా మారాయని చెప్పవచ్చు. శింబు చిత్రాలకు ఆయన సమస్యగా మారడమో లేక ఆయన చిత్ర నిర్మాతలు సమస్యల వలయంలో చిక్కు కోవడమో జరుగుతోంది. శింబు నటించిన ఇటీవల విడుదలైన అచ్చంయన్బదు మడమైయడా నిర్మాణ దశలోనే పలు సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శింబు బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకోవడంతో విడుదల ఆలస్యమైంది.
కాగా తాజాగా శింబు అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్నారు. మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ చిత్ర నిర్మాత మైఖెల్ రాయప్పన్ తనకు రూ. 25 లక్షలు రుణం చెల్సించాల్సి ఉందని, అది తనకు చెల్లించే వరకూ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని ఫైనాన్సియర్ రమేష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 23వ తేదీన బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు నోటీసులు జారి చేసింది.