
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న శింబుతో జత కట్టడమే తన జీవిత లక్ష్యం అంటోంది వర్ధమాన నటి దేవయాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తోంది. అదేవిధంగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. 2021లో రొమాంటిక్ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. ఆవిధంగా ప్రారంభంలోనే గుర్తింపు తెచ్చుకున్న దేవయానిశర్మ పలు రకాల నృత్యాల్లో శిక్షణ పొందడం విశేషం. హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నా తమిళ చిత్రాల్లో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది.
సాధారణ కథానాయకి పాత్రల్లో కాకుండా ప్రతిభకు పదునుపెట్టే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలన్నదే తన ఆశయమని చెబుతోంది. హీరోయిన్లలో కీర్తీ సురేష్, సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని.. నటిగా వారే తనకు ఆదర్శమని పేర్కొంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే శింబు అంటే పిచ్చి అభిమానమని.. కచ్చితంగా ఆయనతో జత కడతానని.. అదే తన జీవిత లక్ష్యమని అంటోంది. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పింది. అదే సమయంలో మంచి నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడానికి తన వంతు కృషిచేస్తానని చెప్పింది. మొత్తం మీద హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పాగా వేసిన ఢిల్లీ భామ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోనూ త్వరలో పాగా వేస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఆశ ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment