సరుకుల లోడ్‌తో ఉన్న నౌకను హైజాక్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు యత్నించారు. నౌకను తమ ఆధీనంలోకి తీసుకునే యత్నంలో ఉన్న ఆ ముగ్గుర్ని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి వేళ చెన్నై హార్బర్‌లో కలకలం రేపింది.
చెన్నై: రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. రాష్ర్టంలో అసాంఘిక శక్తులు చాప కింద నీరులా తమ కార్యకలాపాల్ని కొనసాగించే పనిలో పడ్డాయా? అన్న అనుమానాలు తలెత్తక మానదు. ఎలాంటి కుట్రలు జరిగినా, తిప్పికొట్టేందుకు సిద్ధం అన్నట్టుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. వీరికి పరీక్ష పెట్టే రీతిలో తరచూ ఆపరేషన్ ఆమ్లా పేరిట మాక్ డ్రిల్‌ను సైతం నిర్వహిస్తున్నారు.
ఈ మాక్ డ్రిల్ బుధవారం ఆరంభమై గురువారం వరకు సాగింది. ఈ డ్రిల్‌లో తీవ్ర వాదుల వేషంలో వచ్చిన 61 మంది పోలీసుల్ని రెండు రోజుల పాటుగా అతికష్టం మీద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు ఏకంగా పోలీసుల కళ్లు గప్పి నౌకను హైజాక్ చేయడానికి యత్నించడం కలకలం రేగింది. ఇన్నాళ్లు విమానాల హైజాక్‌ల ఘటనల్ని చూసిన పోలీసులు నౌక హైజాక్ యత్నం సమాచారంతో బెంబేలెత్తిపోయారు.
బుధవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు సముద్ర మార్గం గుండా చెన్నై హార్బర్ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోనికి ప్రవేశించారు. సరుకుల లోడుతో అన్‌లోడింగ్ కోసం వేచి ఉన్న నౌకలోకి ప్రవేశించి, తమ గుప్పెట్లోకి తీసుకునే పనిలో పడ్డారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా నౌకలోకి చొరబడుతుండడాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు. తక్షణం వారిని తమ అదుపులోకి తీసుకునేందుకు పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు.
భద్రతా సిబ్బంది, పోలీసులు, గస్తీ సిబ్బంది ఆ నౌకలోకి చొరబడే యత్నం చేసిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హడావుడితో కాసేపు హార్బర్‌లో కలకలం రేగింది. ఏదో జరిగిందన్న ఉత్కంఠ బయలు దేరింది. చివరకు ఆ ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారించగా, వారు మఫ్టీలో ఉన్న పోలీసులు అధికారులుగా, ఆపరేషన్ ఆమ్లాలో భాగంగానే ఈ హైజాక్ యత్నం సాగినట్టు తేలడం కొసమెరుపు.
నౌక హైజాక్‌కు యత్నం
Published Fri, Mar 20 2015 8:19 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement
Advertisement