మరో ఏడాది నేనే సీఎం
► నా నాయకత్వంలోనే ఎన్నికలకు
► మెజారిటీ సీట్లు మాకే
► చిత్రదుర్గ సభలో సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: తన నాయకత్వంలోనే రానున్న శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్‌పార్టీ ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత శాసనసభ పక్షంలో చర్చించి ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేల్చుతామని అన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం చిత్రదుర్గలోని ప్రభుత్వ కళాశాలలో జరిగిన కృతజ్ఞతా సభలో సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు.
ఆయన ప్రసంగిస్తూ తాను ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పార్టీలోని యువకులతో పాటు సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలనను కొనసాగించడం వల్లే నాలుగేళ్ల పాటు సీఎం స్థానంలో ఉన్నానన్నారు. మరో ఏడాది కూడా ఆ పదవిలో కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధిలోబ్రాండ్ అంబాసిడర్
అభివృద్ధి విషయంలో కర్ణాటకను బ్రాండ్ అంబాసిడర్‌గా చూపిస్తూ ఎన్నికలకు వెళ్తామన్నారు. విపక్ష బీజేపీ చెబుతున్నట్లు గుజరాత్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. గత నాలుగేళ్లలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని పేర్కొంటూ బీజేపీ విడుదల చేసిన ‘చార్జ్‌షీట్’ వాస్తవానికి విరుద్ధమన్నారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోరన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామన్నారు. ముఖ్యంగా బెంగళూరులోని 28 నియోజకవర్గాలనూ గెలుచుకుంటామన్నారు.
అయితే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప మాదిరి ‘నా జేబులో 150 సీట్లు’ ఉన్నాయని చెప్పబోమని వ్యంగ్యంగా అన్నారు. పీసీసీ అధ్యక్ష నియామకంలో తన అభిప్రాయాన్ని హై కమాండ్‌కు తెలియజేశానన్నారు. కార్యక్రమంలో మంత్రులు పరమేశ్వర్, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని సీఎం అందజేశారు. ఒక దంపతులు సీఎంకు పాదాభివందనాలు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది.