
ఆ ముగ్గురిలో మణిరత్నం నాయిక ఎవరు?
దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో కథానాయకులతో పాటు కథానాయికలకూ ప్రాముఖ్యత ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటి మౌనరాగం నుంచి తాజా చిత్రం ఓ కాదల్ కణ్మణి వరకూ ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రేమ కథలైనా,యాక్షన్ చిత్రాలైనా,సెంటిమెంట్‌ను పండించడంలోనయినా మణిరత్నం తనకు తానే సాటి. ఆయన దర్శకత్వశైలి ప్రత్యేకం. ఆ మధ్య ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో మణిరత్నం పని అయిపోయింది. చిత్రాలు చేయడం మానుకోవడం మంచిది అన్నవాళ్లు లేకపోలేదు. తాజా చిత్రం ఓ కాదల్ కణ్మణి చూసిన తరువాత ఇలాంటి ప్రేమకథా చిత్రాలు చేయడంలో మణిదిట్ట అన్న నోళ్లు ఎన్నో.
ఇప్పటికీ మణిరత్నం చిత్రం అంటే పరిశ్రమలోనూ,ప్రజల్లోనూ ఆ క్రేజే వేరు. అలాంటి తాజా చిత్రానికి దర్శకమణి సిద్ధం అయ్యారు. మరోసారి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు సెలైంట్‌గా చేస్తున్నారు. ఇప్పటికే కథానాయకులుగా కార్తీ, దుల్కర్ సల్మాన్ ఓకే అయినట్లు సమాచారం. కథానాయికల విషయమే పెద్ద మర్మంగా మారింది. మణిరత్నం చిత్రంలో నటించడానికి పూర్వ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నుంచి యువతార కీర్తీసురేష్ వరకూ సై అంటున్నారు. నిజానికి ఐశ్వర్యారాయ్ రీఎంట్రీ మణిరత్నం చిత్రంతోనే జరగాల్సింది. ఆమె ఆశించింది అదే. అయితే అనివార్యకారణాల వల్ల మణిరత్నం చేయాల్సిన చిత్రం వాయిదా పడడంతో ఐశ్వర్యారాయ్ హిందీ చిత్రం ద్వారా పున ఃప్రవేశం చేస్తున్నారు. మణిరత్నం తాజా చిత్రంలో ఐశ్వర్య ముఖ్య పాత్ర పోషిస్తునట్లు ప్రచారం జరిగింది.
ఇందులో నటించడానికి ఆమె ఆసక్తిగా ఉన్నా కాల్‌షీట్స్ సర్దుబాటు కావడం లేదని సమాచారం. ఈ విషయం అటుంచితే ఈ మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్‌గా క్రేజీ నటి శ్రుతిహాసన్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత సంచలన నటి నయనతార పేరు ప్రచారంలోకొచ్చింది. వాళ్లిద్దరూ కాకుండా ఇప్పుడు వర్ధమాన నటి కీర్తీసురేష్ పేరు హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడీ ముగ్గురిలో మణి నాయికి ఎవరన్నది? తేలాల్సి ఉంది. విశేషమేవిటంటే పై ముగ్గురూ మణిరత్నం చిత్రం నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇక బాల్ మణి కోర్టులోనే ఉందంటున్నారు. అయితే యువ నటి కీర్తీసురేష్‌కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కోలీవుడ్‌లో విడుదల కాలేదన్నది గమనార్హం. ఈ నెల 31న విక్రమ్‌ప్రభుతో నటించిన ఇదుఎన్న మాయం చిత్రం తెరపైకి రానుంది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన రజనీమురుగన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరో రెండు మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక త్వరలోనే మణిరత్నం వర్గం ఈ సస్పెన్స్‌కు తెరదించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కోమాలి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.