వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
Published Mon, Oct 7 2013 3:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. 46 మంది గాయపడ్డారు. చెన్నై నుంచి పల్లావరానికి శనివారం రాత్రి ఒక కారు వెళుతోంది. పాలవాక్కం ప్రాంతంలో రోడ్డుపై అడ్డు వచ్చిన పశువును తప్పించేందుకు కారు డ్రైవర్ బ్రేకు వేశాడు. దీంతో కారు అదుపు తప్పి అడ్డు గోడను ఢీకొని బోల్తాపడింది. వలసరవాక్కంకు చెందిన డ్రైవర్ తిల్లై (33), నుంగంబాక్కంకు చెందిన హర్షిత్ (26), ఆదంబాక్కంకు చెందిన సుగి (26), తండయార్‌పేటకు చెందిన దినేష్ (25), అయ్యప్పన్ తాంగల్ సిద్ధార్థ్ (22) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వ బస్సుల ఢీ : ఇద్దరు చిన్నారుల మృతి
ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సు శనివారం రాత్రి చెన్నై నుంచి పట్టుకోట్టైకు బయలుదేరింది. జయంకొండం, మన్‌సురిట్టి నెల్లితోట వద్ద వస్తుండగా ఎదురుగా వచ్చిన టౌన్ బస్సు, ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తిరుచ్చి జిల్లా మేల్‌కున్నపట్టికి చెందిన కమల్, బాషా కుమార్తె సుకన్య (2 నెలలు), తురైయూరై, కీరంబూరై కు చెందిన అయూఫ్‌ఖాన్ కుమార్తె నజిలా (3) మృతి చెందారు. రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 40 మంది గాయపడ్డారు. వారిని పోలీసులు జయంకొండాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్లు జయకుమార్(34), మురుగన్(40)తో పాటు 13 మందికి మెరుగైన చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ కళాశాల వైద్యశాలలో చేర్చారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
బైకు, లారీ ఢీ-ఇద్దరి మృతి
పుదుకోట్టై జిల్లా తిరుమయం సమీపంలోని వేలూరు గ్రామానికి చెందిన మహేంద్రన్ (44) మేలూరు పంచాయతీ సభ్యుడు. అదే గ్రామానికి చెందిన అళగప్పన్ (50)తో శనివారం బైకులో పుదుకోట్టైకు వెళ్లాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో మేలూరుకు తిరిగి వస్తుండగా నయన సముద్రం పోలీసు స్టేషన్ సమీపంలో లారీ బైకును ఢీకొంది. దీంతో మహేంద్రన్, అళగప్పన్ మృతి చెందారు.
బైక్, వ్యాన్ ఢీ : ఇద్దరి మృతి
తిరువళ్లూరు జిల్లా మీంజూరు, అత్తిపట్టుకు చెందిన నారాయణన్ (37), సురేష్ కుమార్ (36), చిన్నదురై (36) మిత్రులు. వీరు కాట్టుపళ్లిలో భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. శనివారం రాత్రి పని ముగించుకుని ముగ్గురు ఒకే బైకులో తిరిగి వస్తుండగా కాట్టుపళ్లి వంతెన వద్ద మినీ వ్యాన్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నారాయణన్ సంఘటనా స్థలం వద్ద మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సురేష్, చిన్నదురైను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో సురేష్ కుమార్ మృతి చెందాడు. చిన్నదురై పరిస్థితి విషమంగా ఉంది. కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
Advertisement
Advertisement