సాక్షి, ముంబై: దొంగలు అపహరించిన సొమ్మును ఏం చేస్తారు.. తెలిసిన వారికి తక్కువ ధరకు అమ్మేసుకుంటారు.. ఇదేనా మీ సమాధానం.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే!! చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే 80 శాతం మంది బంగారు ఆభరణాలను ప్రముఖ గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. స్నాచింగ్‌కు సొంత వాహానాలనే వాడుతున్నారని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉంటున్నారని డీసీపీ ధనుంజయ్ కుల్‌కర్ణి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా నేరాలకు పాల్పడటంతో వీరు నాకాబందీ సమయంలో కూడా తప్పించుకుంటున్నారని కుల్‌కర్ణి తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించకుండా గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నారని చెప్పారు. వారికి ఈ విధానం అనుకూలంగా ఉందని, దీంతో మళ్లీ మళ్లీ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని రాష్ట్ర దర్యాప్తు సంస్థ సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. బైకుల ద్వారా చోరీకి పాల్పడుతున్న వారిలో కల్యాణ్‌లోని అంబివెల్లిలో నివాసముంటున్న ఇరానియన్ల హస్తముందని దర్యాప్తులో తేలిందన్నారు.
ఏడాదిలో వెయ్యికిపైగా కేసులు
కాగా, నగరంలో 2015 జనవరి నుంచి 2016 ఏప్రిల్ వరకు 1,066 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని నగర పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దుండగులు అత్యాధునిక బైక్‌లను ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. చైన్ స్నాచింగ్‌కు సంబంధించి 80 శాతం నేరాలు బైకులు ఉపయోగించి చేసినవేనని వెల్లడైంది.
నెలకు రూ.10 లక్షలు లక్ష్యం..
2015 డిసెంబర్ 12న డీఎన్ నగర పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్‌లు అతిఫ్ అన్సారీ (32), ఇర్షద్ ఖాన్ (22)లను అరెస్టు చేశారు. నెలకు రూ.10 లక్షల విలువజేసే బంగారు చైన్‌లను దొంగిలించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు వారు విచారణలో వెల్లడించారని కుల్‌కర్ణి తెలిపారు. ఆ ఇద్దరిపై ముంబై, థానేల్లో 60 వరకు కేసులు నమోదు అయ్యాయన్నారు. తన కొడుకు కేన్సర్ చికిత్స కోసం ఈ నేరాలను ఎంచుకున్నట్లు అన్సారీ చెప్పగా, బైకులను ఆధునీకరించే వ్యాపారం కోసం నేరాలకు పాల్పడినట్లు ఇర్షద్ చెప్పినట్లు వెల్లడించారు.
స్నాచింగ్ సొమ్ము ఎక్కడికి వెళుతోంది?
Published Thu, Apr 21 2016 10:18 AM | Last Updated on Thu, Aug 2 2018 4:59 PM
Advertisement
Advertisement