
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నల్లగొండ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ కానిస్టేబుల్ యాదగిరి చిన్న కుమారుడు
నల్లగొండ (నల్లగొండ క్రైం): నల్లగొండ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ కానిస్టేబుల్ యాదగిరి చిన్న కుమారుడు శ్యాంప్రసాద్(22) మంగళవారం రాత్రి చెన్నై అడయార్‌లోని ఓ లాడ్జిలో ఉరేసుకోగా... బుధవారం అర్ధరాత్రి తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చెన్నైకి హుటాహుటిన వెళ్లారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని పాలెం గ్రామానికి సంబంధించిన చౌగోని యాదయ్య ఏసీబీలో కానిస్టేబుల్.
ఆయన పెద్ద కుమారుడు శ్రీకాంత్ మూడేళ్లుగా అమెరి కాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రెండో కుమారుడు శ్యాంప్రసాద్(22) చెన్నైలోని ర్యాంకీ సిస్టమ్స్ (ఎరోప్లేన్) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శ్యాంప్రసాద్ నలుగురు స్నేహితులతో కలసి చెన్నైలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం అమెరికా నుంచి సోదరుడు శ్రీకాంత్ ఫోన్ చేయగా.. శ్యాంప్రసాద్ లిఫ్ట్ చేయలేదు. మళ్లీ ఫోన్ చేస్తానని ఎస్‌ఎంఎస్ చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మళ్లీ ఫోన్‌చేయగా స్విచ్ ఆఫ్ అయింది. అయితే, శ్యాంప్రసాద్.. తాను ఇంటికి వెళుతున్నానని అతడి స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని కుటుంబసభ్యులు తెలిపారు. లాడ్జిలో ఉరివేసుకోవడానికి ముందు ఓ స్నేహితుడికి తాను రూమ్‌కు వస్తున్నానని శ్యాంప్రసాద్ మేసేజ్ చేసినట్లు స్నేహితులు చెప్పారన్నారు. ఆ తర్వాత స్నేహితులు ఫోన్ చేసినా కలవకపోవడంతో వారు పట్టించుకోలేదని చెప్పారు.
ఆత్మహత్యపై అనుమానాలు
మృతుడి వద్ద ఫోన్ ఉన్నప్పటికీ సిమ్‌కార్డు లేకపోవడంతో ఆత్మహత్య మిస్టరీగా మారింది. లాడ్జిలో ఉన్న సీసీ కెమెరాల్లో శ్యాం ప్రసాద్ ఒక్కడే బ్యాగ్ వేసుకుని లాడ్జిలోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలున్నాయని చెన్నైకి వెళ్లిన అతడి బంధువులు చెప్పారు. బుధవారం ఉదయం శ్యాంప్రసాద్ బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్ తట్టగా.. ఉరేసుకున్న దృశ్యం కనిపించిందని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేందుకు వీసా సిద్ధమైన క్రమంలో ఈ ఘటన జరగడం అతడి కుటుంబ సభ్యులు, బంధువులను కలిచివేసింది. కాగా, మృతదేహాన్ని శుక్రవారం నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలోని సొంత నివాసానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు.