లాంఛనంగా ప్రారంభించిన
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్
తొలి దశలో 27 పాఠశాలల్లో ఏర్పాటు
110 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి
త్వరలో ఎన్డీఎంసీ భవనాలపై కూడా ఏర్పాటు!
న్యూఢిల్లీ: నగరంలోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 60 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ (ఇంటి పైకప్పు) సోలార్ పవర్ ప్లాంట్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ప్రారంభించారు. గోల్ మార్కెట్‌లోని నగర్ పలికా బింగలి గర్ల్స్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ప్రాజెక్టును ఆరంభించిన అనంతరం నజీబ్ జంగ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపునకు తీసుకుంటున్న చర్యల్లో ఇది అతి పెద్ద ముందడుగని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఇది ఒక చారిత్రాత్మక రోజని పేర్కొన్నారు. ‘రూఫ్‌టాప్ సోలార్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్‌సీ) తన పరిధిలోని 27 పాఠశాలల్లో సోలార్ పానెల్స్‌ను ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం దీనికి తగినంత ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో అమలు జరిగితే భవిష్యత్తులో పర్యావరణ రక్షణ, విద్యుత్ పొదుపునకు తీసుకునే చర్యల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా ఎన్డీఎమ్‌సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఈ పాఠశాలల్లో దాదాపు 110 కిలోవాట్ల విద్యుత్ ఉత్పతి జరుగుతుందన్నారు. ఇవే కాకుండా మిగతా 26 పాఠశాలలతో పాటు, ఇతర భవన సముదాయాల్లో కూడా దీనిని విస్తరించనున్నామని వివరించారు. ఎన్డీఎంసీని పునరుత్పాదక ఇంధన వనరుల (ఎంఎన్‌ఆర్‌ఈ) మంత్రిత్వ శాఖ సోలార్ సిటీగా ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనే సొంత సోలార్ ఎనర్జీ ప్లాంట్లను కలిగి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ తమదేనని తెలిపారు. ‘మేం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం(ఎమ్‌ఓయూ) కుదుర్చుకున్నాం. దీనిద్వారా ఎన్డీఎమ్‌సీ పరిధిలోని పలు భవనాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా దాదాపు 2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. అంతే కాకుండా 50 పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో దీన్ని ఏర్పాటుచేసి 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి, కిలోవాట్ విద్యుత్‌ను రూ. 6.35 లక్షలకు అమ్ముతాం. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్డీఎమ్‌సీ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం’ అని శ్రీవాత్సవ చెప్పారు.
మొదటి దశలో భాగంగా 2015-16లో 27 పాఠశాల భవనాలలోని సోలార్ ప్యానెల్స్ ద్వారా 1.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 50 భవనాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేసే కార్యక్రమం వచ్చే ఏడాది పూర్తి అవుతుందన్నారు. ప్రజలు కూడా ఈ సోలార్ ప్యానల్స్‌ను తమ నివాసాలపై ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్డీఎమ్‌సీకి అమ్మాల్సి ఉంటుందని, ఆ ప్యానల్స్ అన్నీ కూడా ఎన్డీఎమ్‌సీ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా భవిష్యత్తులో ఈ విధంగా తమ నివాసాలపై సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకునే ప్రజల కోసం ‘నెట్ మీటర్’ను బిగించాలని ఎన్డీఎమ్‌సీ భావిస్తోంది. తద్వారా ఎన్డీఎంసీ గ్రిడ్‌కు ఎంత మేరకు విద్యుత్‌ను అందిస్తే దానికి బదులుగా ఎలక్ట్రిసిటీ బిల్లులో అంత మొత్తాన్ని తగ్గించాలనే ఆలోచనలో ఎన్డీఎమ్‌సీ ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ పవర్ ప్లాంట్
Published Wed, Apr 22 2015 3:31 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement