Lt Governor Najeeb Jung
-
ప్రధాని మోదీపై సీఎం ఫైర్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై ఫైర్ అయ్యారు. ఢిల్లీలో పూర్తిగా జంగిల్ రాజ్ నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. శాంతిభద్రతలను రక్షించడంలో మోదీ, జంగ్ విఫలమయ్యారని నిందించారు. ఢిల్లీలో బ్రహ్మపుర ప్రాంతంలో తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు హత్యకు గురికావడం.. మరో ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం వంటి దారుణాలు వెలుగుచూశాక కేజ్రీవాల్.. శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, జంగ్లను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ పవర్ ప్లాంట్
లాంఛనంగా ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తొలి దశలో 27 పాఠశాలల్లో ఏర్పాటు 110 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి త్వరలో ఎన్డీఎంసీ భవనాలపై కూడా ఏర్పాటు! న్యూఢిల్లీ: నగరంలోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 60 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ (ఇంటి పైకప్పు) సోలార్ పవర్ ప్లాంట్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ప్రారంభించారు. గోల్ మార్కెట్లోని నగర్ పలికా బింగలి గర్ల్స్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ప్రాజెక్టును ఆరంభించిన అనంతరం నజీబ్ జంగ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపునకు తీసుకుంటున్న చర్యల్లో ఇది అతి పెద్ద ముందడుగని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఇది ఒక చారిత్రాత్మక రోజని పేర్కొన్నారు. ‘రూఫ్‌టాప్ సోలార్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) తన పరిధిలోని 27 పాఠశాలల్లో సోలార్ పానెల్స్‌ను ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం దీనికి తగినంత ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో అమలు జరిగితే భవిష్యత్తులో పర్యావరణ రక్షణ, విద్యుత్ పొదుపునకు తీసుకునే చర్యల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్డీఎమ్సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ఈ పాఠశాలల్లో దాదాపు 110 కిలోవాట్ల విద్యుత్ ఉత్పతి జరుగుతుందన్నారు. ఇవే కాకుండా మిగతా 26 పాఠశాలలతో పాటు, ఇతర భవన సముదాయాల్లో కూడా దీనిని విస్తరించనున్నామని వివరించారు. ఎన్డీఎంసీని పునరుత్పాదక ఇంధన వనరుల (ఎంఎన్ఆర్ఈ) మంత్రిత్వ శాఖ సోలార్ సిటీగా ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనే సొంత సోలార్ ఎనర్జీ ప్లాంట్లను కలిగి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ తమదేనని తెలిపారు. ‘మేం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం(ఎమ్ఓయూ) కుదుర్చుకున్నాం. దీనిద్వారా ఎన్డీఎమ్సీ పరిధిలోని పలు భవనాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా దాదాపు 2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. అంతే కాకుండా 50 పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో దీన్ని ఏర్పాటుచేసి 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి, కిలోవాట్ విద్యుత్‌ను రూ. 6.35 లక్షలకు అమ్ముతాం. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్డీఎమ్సీ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం’ అని శ్రీవాత్సవ చెప్పారు. మొదటి దశలో భాగంగా 2015-16లో 27 పాఠశాల భవనాలలోని సోలార్ ప్యానెల్స్ ద్వారా 1.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 50 భవనాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేసే కార్యక్రమం వచ్చే ఏడాది పూర్తి అవుతుందన్నారు. ప్రజలు కూడా ఈ సోలార్ ప్యానల్స్‌ను తమ నివాసాలపై ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్డీఎమ్సీకి అమ్మాల్సి ఉంటుందని, ఆ ప్యానల్స్ అన్నీ కూడా ఎన్డీఎమ్సీ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా భవిష్యత్తులో ఈ విధంగా తమ నివాసాలపై సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకునే ప్రజల కోసం ‘నెట్ మీటర్’ను బిగించాలని ఎన్డీఎమ్సీ భావిస్తోంది. తద్వారా ఎన్డీఎంసీ గ్రిడ్‌కు ఎంత మేరకు విద్యుత్‌ను అందిస్తే దానికి బదులుగా ఎలక్ట్రిసిటీ బిల్లులో అంత మొత్తాన్ని తగ్గించాలనే ఆలోచనలో ఎన్డీఎమ్సీ ఉంది. -
సమృద్ధిగా నీరు - పరిశుభ్రత
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరంలో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన రాత్రి శిబిరాలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలను చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఈ నెల 15 నుంచి పనిచేయడం ప్రారంభించింది. నగరంలోని అన్ని నైట్ షెల్టర్లకు ప్రతిరోజు 800 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ జలబోర్డును బుధవారం ఆదేశించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వ కార్యదర్శులు, సీనియర్ అధికారులు తరచు గా ఈ నైట్‌షెల్టర్లను తనిఖీ చేయాలని కూడా ఆయన సూచించారు. నగరంలో నైట్‌షెల్టర్ల స్థితిగతులపై లెప్టినెంట్ గవర్నర్ బుధవారం సమీక్షా సమావేశం జరి పారు. నైట్ షెల్టర్లలో పారిశుధ్య నిర్వహణకు సిబ్బం దిని రెట్టింపు చేయాలని ఎల్జీ డీయూఎస్ఐబీని ఆదేశిం చారు. డాక్టర్లు, మొబైల్ క్లినిక్‌లు నైట్‌షెల్టర్లను సందర్శిస్తున్నది లేనిదీ తనిఖీ చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రస్తుతం 130 నైట్షెల్టర్లకు డీజేబీ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. మరో 79 శిబిరాలకు పైప్‌లైన్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 219 నైట్‌షెల్టర్లు ఉన్నాయి. శాశ్వత నిర్మాణాలు, పోర్టా కేబిన్లు, టెంట్లు, కమ్యూనిటీ హాళ్ళలో నడుస్తోన్న ఈ షెల్టర్లలో 15,000 మంది తలదాచుకునే వీలుంది. అయితే నగరంలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ కొన్ని నైట్ షెల్టర్లలో ఉండడానికి నిరాశ్రయులు ఇష్టపడటం లేదు. నైట్ షెల్టర్ల కన్నా చలిలో నీలాకాశం కింద నిద్రించడాన్నే వారు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైట్‌షెల్టర్లలో ఏవైనా లోపాలుంటే ఎల్జీ లిజినింగ్ పోస్ట్‌కు తెలియచేయాలని నజీబ్‌జంగ్ కోరారు. 155355 టోల్ ఫ్రీ నంబరుకు గానీ, 23975555, 23976666, 23978888, 23994444 నంబర్లకు గానీ కాల్ చేయాలని చెప్పారు. లేదా లిజినింగ్పోస్ట్ఢిల్లీఎల్జీ డాట్‌ఇన్‌కు లాగైగానీ ఎల్జీజీసీడాట్ ఢిల్లీకి ఈ మెయిల్ పంపిగానీ తెలియచేయవచ్చు. -
విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి: ఎల్జీ
సాక్షి, న్యూఢిల్లీ: విద్యా ప్రమాణాల మెరుగు కోసం అధ్యాపకులు కృషి చేయాలని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పిలుపు ఇచ్చారు. ఉన్నత విద్యా విభాగం, ఎన్సీటీలు సంయుక్తంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఢిల్లీ యూనివర్సి టీ పరిధిలోని కళాశాలల్లో పనిచేస్తున్న 10మంది ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎల్జీ సన్మానించారు. అధ్యాపకులు విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి జీవితాలను ప్రభావితం చేయాలని చెప్పారు. అంకితభావం కలిగిన అధ్యాపకుల సేవల అవసరం దేశానికి ఉందని ఆయన చెప్పారు. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ అనిందో మజుమ్దార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా, జీజీఎస్ఐపీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే.త్యాగి, ఉన్నత విద్యామండలి డెరైక్టర్ అచల్సింగ్, వివిధ కాలేజీలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలకు సంపూర్ణ రక్షణ నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అన్నారు. డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎల్జీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మహిళలపై నేరాల సంఖ్య తగ్గించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళపై ఆరోజు జరిగిన ఘటన దురదుష్టకరమని, ఇంకా దురాఘాతాలు కొనసాగడం దేశానికే తలవంపులని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పక డ్బందీ చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో ‘మహిళా సెల్’ ఏర్పాటు చేయిస్తున్నామని, మహిళల రక్షణ కోసం నగరంలో పలుచోట్ల సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
అనిశ్చితికి తెర
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తేల్చి చెప్పడంతో ఎన్నికలు జరగడం తథ్యమని తేలిపోయింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ప్రకటనను లెఫ్టినెంట్ గవర్నర్ త్వరలో జారీ చేయవచ్చని, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నిక లు జరుగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎనిమిది నెలలుగా కొనసాగతున్న రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేసే నిర్ణయం తీసుకోవడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను చర్చలకు ఆహ్వానించారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ముఖీ సోమవారం ఉదయమే లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో తమకు సంఖ్యా బలం లేనందువ ల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని తెలుపుతూ లేఖను అందించారని వార్తలు వచ్చాయి. ఉదయం తొమ్మిదిన్నరకు బీజేపీ నేతలు ఎల్జీతో సమావేశమయ్యారని, వారి సమావేశం పది నిమిషాలు జరిగిందని రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి, ఇతర పార్టీలను చీల్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సుముఖంగా లేరని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. పార్టీ అగ్రనేతల అభీష్టం మేరకు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయరాదని పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు సోమవారం ఉదయం ఎల్జీకి తెలిపారని అనధికార వర్గాలు తె లిపాయి. ఢిల్లీ వ్యవహారాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించడంతో పార్టీ నేతలు, ప్రతినిధులు ఎవరూ పెదవి విప్పడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోనని తేల్చి చెప్పడంతో, ఎల్జీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లను చర్చలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలకు రావలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీని, మూడు గంటలకు రావలసిందిగా కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తూ ఎల్జీ లేఖ రాశారు. ఎన్నికలకు సిద్ధం : కాంగ్రెస్ కాంగ్రెస్ విధానసభ పక్ష అధ్యక్షుడు హరూన్ యూసఫ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దుచేయాలని తాను ఎల్జీని కోరినట్లు ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్లతో పాటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని తాము ఎల్జీని కోరినట్లు ఆయన తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలలో పోటీచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన రాజ్‌నివాస్ వద్ద విలేకరులతో చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వం లేకపోవడం వల్ల నగరవాసులు సమస్యలపాలయ్యారని ఆయన అన్నారు. అధిక ధరలు, విద్యుత్తు చార్జీల పెరుగుదల, నీటి కొరత, విద్యుత్తు కోతలు వంటి అనేక సమస్యలతో ఢిల్లీవాసులు పడ్తోన్న ఇబ్బంది గురించి ఆప్, బీజేపీకి పట్టింపు లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నికలంటే భయపడ్తోందని, ఉప ఎన్నికల భయంతోనే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ ఇచ్చిందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. -
కొనసాగుతున్న అనిశ్చితి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించడం కోసం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు రోజులకొద్దీ కొనసాగే అవకాశముంది కనుక గురువారం సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ విచారణ కొచ్చినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొంత వెసులుబాటు లభించవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై జాప్యం చేయడాన్ని సుప్రీం కోర్టు ఎల్జీని, కేంద్రాన్ని మందలించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి విదేశీ యాత్ర నుంచి తిరిగివచ్చిన నజీబ్‌జంగ్ బుధవారం ఉదయం హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. రాజధానిలో సర్కారు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేముందు తాను అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలనుకుంటున్నట్లు జంగ్ హోమ్ మంత్రికి తెలిపారు. ఆ తరువాత ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను అన్వేషించేందుకు రాష్ట్రపతి అనుమతించిన దృష్ట్యా లెఫ్టినెంట్ గవర్నర్ రానున్న రోజులలో రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తారని ఈ ప్రకటన పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ మొదట అసెంబ్లీలో అతి పెద్ద పార్టీఅయిన బీజేపీని చర్చలకు ఆహ్వానిస్తారని, ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లతో సంప్రదింపులు జరుపుతారని ఎల్జీ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎమ్మెల్యేల బేరసారాలు జరిగే అవకాశముందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేక ఎన్నికలకు వెళ్లాలా అన్న మీమాంస నుంచి బీజేపీ ఇంకా బయటపడలేదు. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమని మంగళవారం ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం మాట మార్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ తమ పార్టీని ఆహ్వానించినట్లయితే ఆ విషయాన్ని పరిగణిస్తామని చెప్పారు. బీజేపీలో ఊగిసలాటకు వెంకయ్య నాయుడు మాటలు అద్దం పట్టాయి. పార్టీ ఎమ్మెల్యేలలో పలువురితో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంవైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అయితే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడానికి, తన వైఖరి స్పష్టం చేయడానికి జంకుతోందని రాజకీయపండితులు అంటున్నారు. ఎల్జీది కాలయాపనే: ఆప్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం అన్ని పార్టీల నేతలతో చర్చలు జరపాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విమర్శించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ బుధవారం నాడే అన్ని రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించి సాయంత్రం వరకు తుది నిర్ణయం తీసుకుని దానిని గురువారం కోర్టుకు తెలియచేయవచ్చని ఆమ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ పట్ల పక్షపాతం చూపుతున్నారని ఆయన ఆరోపించారు. నజీబ్ జంగ్‌తో కుమ్మక్కైన బీజేపీ తెరవెనుకనుంచి ప్రభుత్వం నడుపుతోందని ఆయన ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగాన్ని సంరక్షించడానికి బదులు బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని పార్టీలను పిలిచి ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై చర్చలు జరపాలని తాము ఎనిమిది నెలలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇన్నాళ్లు ఆ పని చేయని ఎల్జీ ఇప్పుడు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని అంటున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎన్నికలకు వెనుకాడుతోందని, అందుకే లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గురువారం సుప్రీంకోర్టులో విచారణను మరో నెలరోజుల పాటు వాయిదా వేయించుకోవడానికే ఎల్జీ చర్చలంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌పై ధ్వజమెత్తింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలుచేయడానికి ఎల్జీ బీజేపీకి సమయం ఇస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. అసెంబ్లీలో సంఖ్యా బలం లేని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. కేంద్రంలోనున్న వారిని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మెప్పించడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తాత్సారం చేస్తూ ఇతర పార్టీల శాసనభ్యులకు వలవేయడానికి బీజేపీకి తగిన సమయం ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ ఆరోపించారు. -
నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే ముందు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమలనాథులతో కలిసి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఏజెంట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గత 8 నెలల్లో నజీబ్ జంగ్ చేసిందేమీ లేదని కేజ్రీవాల్ విమర్శించారు. -
ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేను: జంగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై ప్రస్తుత పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు జంగ్ పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం గవర్నర్ జంగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. మైనారిటీ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరిన నేపథ్యంలో విలేకరులు జంగ్‌ను ప్రశ్నించగా ఈ పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనన్నారు. -
అదనపు వనరులను అన్వేషించండి
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో నీటి సరఫరా. విద్యుత్ తదితర సమస్యల పరిష్కారం కోసం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజ్‌నివాస్‌లో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), జల్ బోర్డు అధికారులతో జరిగిన తొలి సమావేశంలో ఆయన ద్వారకాకు నీటిసరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించా రు. ద్వారకాకు నీటిసరఫరాను కొనసాగిస్తూనే ఇత ర వనరుల నుంచి అదనంగా నీరందించే మార్గాలను అన్వేషించాల్సిందిగా ఎల్జీ వారికి సూచించా రు. ద్వారకా ప్రాంతానికి నీరందించాల్సిందిగా డీడీఏని ఆదేశించారు. ఈ సందర్భంగా డీడీఏ అధికారులు మాట్లాడుతూ ఈ నెల 20 నాటికి ద్వారకాకు అదనపు నీటిని అందుబాటులోకి తేనున్నట్లు ఎల్జీకి తెలియజేశారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం రానున్న మూడు నెలల పాటు ద్వారకాకు ఉచితంగా నీటి ట్యాంకర్లను సరఫరా చేసే మార్గాన్ని అన్వేషించాల్సిందిగా ఎల్జీ... డీడీఏకి సూచించారు. డీజేబీ, డిస్కం అధికారులతోనూ సమీక్ష ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) అధికారులతో పాటు డిస్కం అధికారులతో జరిపిన మరో సమావేశంలో నూ నజీబ్ జంగ్ నగరంలో నీటి సరఫరాతో పాటువిద్యుత్ సరఫరాను సమీక్షించారు. ఏప్రిల్ 23న జరిగిన సమావేశంలో జారీ చేసిన ఆదేశాలను డీజేబీ, డిస్కంలు ఏ మేరకు అమలుచేస్తున్నాయనే విషయాన్ని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. నజీబ్ జంగ్ సూచన మేరకు నీటి ట్యాంకర్ల నుంచి నీరు వృథాగా పోకుండా చేయడంకోసం స్టీలు ట్యాంకర్లను వినియోగిస్తున్నట్టు డీజేబీ తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం కోసం అనేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయడంతోపాటు, మూడు కాల్ సెంటర్లు, 24 వాటర్ ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు డీజేబీ అధికారులు తెలిపారు.ఈ కంట్రోల్ రూముల పనితీరును నజీబ్ జంగ్ స్వయంగా ఫోన్ చేసి పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీజేబీ నీటి శుద్ధి ప్లాంట్ ఉన్న ప్రాంతాలలో కోతలు లేకుండా చూడాలంటూ నజీబ్ జంగ్.. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. విద్యుత్ కోతలకు సంబంధించిన నివేదిక తనకు సమర్పించాల్సిందిగా ఎల్జీ... డిస్కంలను ఆదేశించారు. మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ఎల్జీ ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నగరవాసులకు చేరవేసేందుకు వీలుగా రూపొందించిన మొబైల్ అప్లికేషన్‌ను ఎల్జీ నజీబ్ జంగ్ గురువారం ఆవిష్కరించారు. దీంతోపాటు నవీకరించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. కాగా ట్రాఫిక్ మొబైల్ అప్లికేషన్‌ను ఢిల్లీ ట్రాఫిక్ విభాగం అభివృద్ధి చేసింది. దీనిని తమ తమ సెల్ఫోన్లలో వాడుకునే నగరవాసులు ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయకపోతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు వీలవుతుంది. -
ఆస్పత్రుల పనితీరుపై ‘జంగ్’!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న తీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రులైన లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్, గురుతేజ్ బహదూర్ ఆస్పత్రుల రూపురేఖలు నెలరోజుల్లో మారిపోవాలన్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు కోర్టు ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనన్నారు. ఈ విషయమై నజీబ్ జంగ్ గురువారం ఢిల్లీ ఆసుపత్రుల పని తీరును సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి, ఢిల్లీ అసుపత్రుల ప్రతినిధులు, ఇన్స్పెక్టర్ల బృందం, లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయ సీనియర్ అధికారులతో ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఢిల్లీ ఆసుపత్రుల పనితీరును సమీక్షించారు. ఢిల్లీ అసుపత్రులను తనిఖీచేసిన ఇన్స్పెక్టర్లు సమర్పించిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సదుపాయాలను, ఓపీడీ సదుపాయాలను, మందుల లభ్యతను, పారిశుధ్యాన్ని, భద్రతను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను లెఫ్టినెంట్ గవర్నర్ నొక్కి చెప్పారు. లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రులను మోడల్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఓ కమిటీని నియమించారు. ఆరోగ్య కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి సభ్యులుగా ఉన్న ఈ సంఘం ఈ రెండు ఆస్పత్రులను దత్తత తీసుకొని, వాటి పనితీరును, నిర్వహణను మెరుగుపరిచి నగరంలోని అత్యుత్తమ ఆస్పత్రుల స్థాయిలో నెలరోజుల్లో అభివృద్ధి చేయాలని జంగ్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు తమ ఇన్‌పేషెంట్ డిపార్ట్మెంట్లో 10 శాతాన్ని, ఓపీడీలో 25 శాతాన్ని పేద రోగుల ఉచిత చికిత్స కోసం కేటాయిస్తూ కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల పనితీరును పరిశీలించాలని లెప్టినెంట్ గవర్నర్ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. పేదరోగులకు కల్పించే ఈ సదుపాయాన్ని గురించిన సమాచారాన్ని ప్రైవేటు ఆస్పత్రుల బయట, రిసెప్షన్లో ప్రదర్శించేలా చూడాలని ఆయన ఆదేశించారు. -
పునరాలోచించండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమక్షంలో జన్‌లోక్ పాల్ చట్టం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. ఇందులోభాగంగా ఈ నెల 16న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు తంటాలుపడుతోంది. అయితే పోలీసుల అభ్యంతరాల దృష్ట్యా శాసనసభ వెలుపల సమావేశం నిర్వహించే యోచనను పునఃపరిశీలించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సూచించారు. సోమవారం తనను కలసిన కేజ్రీవాల్‌కు ఆయన ఈ సలహా ఇచ్చారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఢిల్లీ విధానసభ ప్రత్యేక సమావేశాలు ఆరంభం కానున్నాయి. 13న జన్లోక్పాలఃబిల్లుతోపాటు స్వరాజ్ బిల్లును కూడా ప్రవేశపెడతామని, స్వరాజ్ బిల్లును 15న అసెంబ్లీ ఆమోదిస్తుందని కేజ్రీవాల్ అంటున్నారు. జన్‌లోక్ పాల్ బిల్లు ఆమోదంకోసం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే అసెం బ్లీలో కాకుండా మరోచోట నిర్వహించాలనే యోచనను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ కార్యక లాపాలకు అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతో వచ్చే వ్యక్తులను గుర్తించి వేరుచేయడం వీలుకాదని పోలీసులు అంటున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్... కే జ్రీవాల్‌కు తెలిపారు. పోలీసుల అభ్యంతరాలతోపాటు భారీ సంఖ్యలో తరలివచ్చే ప్రజలను నియంత్రించడం కష్టమన్న విషయం జనతాద ర్బార్‌లో తేటతెల్లమైందని, శాసనసభ సమీపంలో ప్రజలను నియంత్రించడం మరింత కష్టమని లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు., అసెంబ్లీ కార్యకలాపాల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో అసెంబ్లీని సమావేశపరిచే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పునరాలోచించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు. జన్‌లోక్‌పాల్ బిల్లుపై రాజకీయం ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులొడ్డి ప్రయత్నించడం, ప్రతిపక్షం సర్కారును కూలదోయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో సాధార ణం. అయితే ఢిల్లీలో మాత్రం ఇందుకు భిన్నమైన స్థితి కనిపిస్తోంది. జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందనట్లయితే తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెదిరిస్తుండగా, ముఖ్యమంత్రిని రాజీనామా చేయనివ్వబోమని అసెంబ్లీలో ప్రతిపక్షనేత హర్షవర్ధన్ అంటున్నారు. జన్‌లోక్‌పాల్ చట్టంకోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధమని , లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందనట్లయితే రాజీనామా చేస్తానని, ప్రభుత్వం కూలడం ఖాయమని ముఖ్యమంత్రి అంటుండగా, తాము రాజీనామా సమర్పించి కేజ్రీవాల్‌ను పారిపోనివ్వబోమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టరూపం దాల్చకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అసెంబ్లీలో బిల్లుకు అడ్డమొస్తే రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లోక్‌పాల్ బిల్లుపై ప్రతి చోటా ఆర్భాటం చేసే ముఖ్యమంత్రి ఇంతవరకు తమన ఎమ్మెల్యేలకు లోక్‌పాల్ బిల్లు కాపీని చూపించలేదని హర్షవర్ధన్ ఆరోపించారు. కేజ్రీవాల్ తన నాటకాన్ని తక్షణమే నిలిపివేయాలని, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో పారిపోనివ్వబోమని చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అవినీతి వ్యతిరేకపోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని హర్షవర్ధన్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటీవలే అధికారంలోకి వ చ్చిన దృష్ట్యా నెలన్నరలోనే ప్రభుత్వాన్ని కూల్చి అది కూడా అవినీతి నిరోధక బిల్లు విషయమంలో ప్రభుత్వాన్ని పడగొట్టామనే అపకీర్తితో ప్రజల ముందుకెళ్లడానికి బీజేపీ వెనుకాడుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నప్పటికీ మరోసారి అసెంబ్లీ ఎన్నికల భారాన్ని భుజానికెత్తుకోవడానికి అటు బీజేపీగానీ లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానీ సిద్ధంగా లేరని తెలుస్తోంది. -
ఎల్జీ.. స్నేహశీలి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ‘ముందస్తు’ చర్యలకు ఉపక్రమించింది. కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటినుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఏదో ఒక విషయమై గొడవ పడుతూనే ఉంది. తాజాగా జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలోనూ అతడితో అమీతుమీకి సిద్ధమైంది. కాగా, ఆదివారం సీఎం కేజ్రీవాల్ మాటల్లో హఠాత్తుగా వ్యత్యాసం గోచరించింది. ఎల్జీ నజీబ్ జంగ్‌ను స్నేహశీలి, మృదు స్వభావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనతో తనకు విభేదాలు లేవని సీఎం చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో నజీబ్ జంగ్ వైఖరిపై ఆప్ నేతలు ఆగ్రహంతో ఉన్నప్పటికీ భాష విషయంలో వారు సంయమనం పాటించాలని ఆయన నొక్కిచెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, వాటికి బీటలు పడలేదని కేజ్రీవాల్ పీటీఐ ఎడిటర్లతో చెప్పారు. నజీబ్ జంగ్ మంచి మనిషని, తామిద్దరి మధ్య చక్కటి స్నేహం ఉందని ఆయన చెప్పారు. ఆయనతోనున్న సత్సంబంధాలు మున్ముందు కూడా కొనసాగుతాయన్న ఆశాభావాన్ని కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. ఆప్ నేత ఆశుతోష్ లెప్టినెంట్ గవర్నర్‌ను కాంగ్రెస్ ఏజెంట్‌గా పేర్కొన్నడాన్ని గురించి సంపాదకులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన మాటల విషయంలో సంయమనం పాటించాలని తాను భావిస్తున్నానని చెప్పారు. పార్టీ నేతల్లో కొందరికి కోపముండవచ్చని, అయితే ఎంత కోపమున్నా పదాలను ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి ముఖ్యమైన సమాచారం లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు లీక్ చేస్తున్నారో తనకు తెలియదన్నారు. ఆయన ఈ సందర్భంగా కొన్ని సంఘటనలను ఉదహరించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను తొలగించాలని కోరుతూ తమ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపిన కాసేపటికే ప్రభుత్వం సిఫారసును ఎల్జీ తోసిపుచ్చారన్న వార్త టీవీ చానళ్లలో వచ్చిందన్నారు. దానిపై తాము ఎల్జీ కార్యాలయాన్ని వెంటనే సంప్రదించగా అలాంటిదేమీ లేదని అన్నప్పటికీ మరుసటి రోజు ఎల్జీ కార్యాలయం నుంచి తమకు తిరిగి వచ్చిన ఫైల్లో టీవీ చాన ళ్లలో చెప్పిన విషయమే ఉందని కేజ్రీవాల్ చెప్పారు. ఇది తీవ్రంగా తీసుకోవలసిన విషయమని, రాజ్యాంగ సమస్య అని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తోందని కొందరు అంటున్నారని ఆయన చెప్పారు.లెఫ్టినెంట్ గవర్నర్ జన్‌లోక్‌పాల్ బిల్లుపై సొలిసిటర్ జనరల్ సలహా కోరిన విషయం కూడా లీకవడం కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమేనని సీఎం ఆరోపించారు. నిజానికి తాను అంతకు ముందు లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి తాము కూడా బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయమై రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకున్నట్లు చెప్పాలనుకున్నానని, కానీ ఎల్జీ కార్యాలయం నుంచి సమాచారం లీకైన తర్వాత తాను కూడా ఎల్జీకి లేఖ రాసి మీడియా ముందుంచానని సీఎం కేజ్రీవాల్ వివరించారు. -
‘రొటీన్’ కామెంట్!
సాక్షి, న్యూఢిల్లీ:డామిట్... కథ అడ్డం తిరిగిందా? అందుకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిశారా? నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఎల్జీ-సీఎం సమావేశం జరిగిందా? గురువారంనాటి పరిణామాలపై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చలివి. మంత్రులు చెప్పినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలతో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు నగరంలో హల్చల్ చేసిన ముఖ్యమంత్రి ఎల్జీ అభ్యర్థన మేరకు వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అదే ఎల్జీతో తాను సమావేశం కావడంపై కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇచ్చినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. నజీబ్ జంగ్‌తో దాదాపు 20 నిమిషాలపాటు సమావేశమైన కేజ్రీవాల్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ‘రొటీన్’గానే గవర్నర్‌తో సమావేశమయ్యానని, సోమ్‌నాథ్ భారతి వ్యవహారం తమ మధ్య చర్చకు రాలేదని తెలిపారు. అయితే ఆయన ప్రత్యర్థులు మాత్రం న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ తప్పించాల్సిందిగా వెల్లువెత్తుతున్న డిమాండ్లపై చర్చించి ఉంటారని చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా స్పందించాయి. ప్రతి బుధవారం గవర్నర్‌తో కేజ్రీవాల్ సమావేశమై ప్రభుత్వ వ్యవహారాల గురించి చర్చిస్తారని, అయితే ధర్నా అనంతరం ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో బుధవారం సమావేశం కాలేదని, ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో గురువారం సమావేశమయ్యారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్ కూడా ఎల్జీని కలవడం వల్ల వారి సమావేశంలో సోమ్‌నాథ్ భారతి వ్యవహారం చర్చకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు కోర్టు చీవాట్లు ఢిల్లీ రాష్ట్ర న్యాయ మంత్రి సోమనాథ్ భారతి నేతృత్వంలో తమ ఇంటిపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఉగాండా మహిళ చేసిన ఫిర్యాదుపై స్పందించని రాష్ట్ర పోలీసులకు స్థానిక కోర్టు గట్టిగా చీవాట్లు పెట్టింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్య తీసుకోలేదని మండిపడింది. ఈ ఉదంతంపై దక్షిణ డీసీపీ కార్యాలయానికి ఫిర్యాదు అందిందో, లేదో, అంది ఉంటే ఏ చర్యలు తీసుకున్నారో ఈ నెల 25లోగా తమకు వివరణ ఇవ్వాలని సదరు డీసీపీని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతానా సింగ్ గురువారం ఆదేశించించారు. ‘మాకందిన పిటిషన్లో చాలా ఆరోపణలు ఉన్నాయి. మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు స్వీకరించింది. అయినా వారు చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. పిటిషన్‌పై మేం ఆదేశాలిచ్చేముందు డీసీసీ నుంచి సమాధానం కావాలి’ అని పేర్కొన్నారు.ఈ నెల 15న అర్ధరాత్రి సోమనాథ్ భారతి నేతృత్వంలో తమ ఫ్లాట్‌పై దాడి చేసి, అనుచితంగా ప్రవర్తించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చే యాలని ఉగాండా మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరో అఫ్రికన్ మహిళతోపాటు మరొకరు వేసిన పిటిషన్లపై స్పందించిన కోర్టు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.