ఢిల్లీలో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తేల్చి చెప్పడంతో ఎన్నికలు జరగడం తథ్యమని తేలిపోయింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తేల్చి చెప్పడంతో ఎన్నికలు జరగడం తథ్యమని తేలిపోయింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ప్రకటనను లెఫ్టినెంట్ గవర్నర్ త్వరలో జారీ చేయవచ్చని, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నిక లు జరుగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎనిమిది నెలలుగా కొనసాగతున్న రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేసే నిర్ణయం తీసుకోవడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను చర్చలకు ఆహ్వానించారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్‌దీశ్‌ముఖీ సోమవారం ఉదయమే లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో తమకు సంఖ్యా బలం లేనందువ ల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని తెలుపుతూ లేఖను అందించారని వార్తలు వచ్చాయి. ఉదయం తొమ్మిదిన్నరకు బీజేపీ నేతలు ఎల్జీతో సమావేశమయ్యారని, వారి సమావేశం పది నిమిషాలు జరిగిందని రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి.
మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి, ఇతర పార్టీలను చీల్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సుముఖంగా లేరని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. పార్టీ అగ్రనేతల అభీష్టం మేరకు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయరాదని పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు సోమవారం ఉదయం ఎల్జీకి తెలిపారని అనధికార వర్గాలు తె లిపాయి. ఢిల్లీ వ్యవహారాలపై ఎలాంటి ప్రకటన చేయరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించడంతో పార్టీ నేతలు, ప్రతినిధులు ఎవరూ పెదవి విప్పడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోనని తేల్చి చెప్పడంతో, ఎల్జీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లను చర్చలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలకు రావలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీని, మూడు గంటలకు రావలసిందిగా కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తూ ఎల్జీ లేఖ రాశారు.
ఎన్నికలకు సిద్ధం : కాంగ్రెస్
కాంగ్రెస్ విధానసభ పక్ష అధ్యక్షుడు హరూన్ యూసఫ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఎన్నికలకు తాము సిద్ధమని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దుచేయాలని తాను ఎల్జీని కోరినట్లు ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్‌లతో పాటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని తాము ఎల్జీని కోరినట్లు ఆయన తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలలో పోటీచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన రాజ్‌నివాస్ వద్ద విలేకరులతో చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వం లేకపోవడం వల్ల నగరవాసులు సమస్యలపాలయ్యారని ఆయన అన్నారు. అధిక ధరలు, విద్యుత్తు చార్జీల పెరుగుదల, నీటి కొరత, విద్యుత్తు కోతలు వంటి అనేక సమస్యలతో ఢిల్లీవాసులు పడ్తోన్న ఇబ్బంది గురించి ఆప్, బీజేపీకి పట్టింపు లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నికలంటే భయపడ్తోందని, ఉప ఎన్నికల భయంతోనే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ ఇచ్చిందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు.