ఎల్జీ.. స్నేహశీలి!
Published Sun, Feb 9 2014 10:56 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ‘ముందస్తు’ చర్యలకు ఉపక్రమించింది. కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటినుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఏదో ఒక విషయమై గొడవ పడుతూనే ఉంది. తాజాగా జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలోనూ అతడితో అమీతుమీకి సిద్ధమైంది. కాగా, ఆదివారం సీఎం కేజ్రీవాల్ మాటల్లో హఠాత్తుగా వ్యత్యాసం గోచరించింది. ఎల్జీ నజీబ్ జంగ్‌ను స్నేహశీలి, మృదు స్వభావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనతో తనకు విభేదాలు లేవని సీఎం చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో నజీబ్ జంగ్ వైఖరిపై ఆప్ నేతలు ఆగ్రహంతో ఉన్నప్పటికీ భాష విషయంలో వారు సంయమనం పాటించాలని ఆయన నొక్కిచెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, వాటికి బీటలు పడలేదని కేజ్రీవాల్ పీటీఐ ఎడిటర్లతో చెప్పారు. నజీబ్ జంగ్ మంచి మనిషని, తామిద్దరి మధ్య చక్కటి స్నేహం ఉందని ఆయన చెప్పారు. ఆయనతోనున్న సత్సంబంధాలు మున్ముందు కూడా కొనసాగుతాయన్న ఆశాభావాన్ని కేజ్రీవాల్ వ్యక్తం చేశారు.
ఆప్ నేత ఆశుతోష్ లెప్టినెంట్ గవర్నర్‌ను కాంగ్రెస్ ఏజెంట్‌గా పేర్కొన్నడాన్ని గురించి సంపాదకులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన మాటల విషయంలో సంయమనం పాటించాలని తాను భావిస్తున్నానని చెప్పారు. పార్టీ నేతల్లో కొందరికి కోపముండవచ్చని, అయితే ఎంత కోపమున్నా పదాలను ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి ముఖ్యమైన సమాచారం లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు లీక్ చేస్తున్నారో తనకు తెలియదన్నారు. ఆయన ఈ సందర్భంగా కొన్ని సంఘటనలను ఉదహరించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను తొలగించాలని కోరుతూ తమ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపిన కాసేపటికే ప్రభుత్వం సిఫారసును ఎల్జీ తోసిపుచ్చారన్న వార్త టీవీ చానళ్లలో వచ్చిందన్నారు.
దానిపై తాము ఎల్జీ కార్యాలయాన్ని వెంటనే సంప్రదించగా అలాంటిదేమీ లేదని అన్నప్పటికీ మరుసటి రోజు ఎల్జీ కార్యాలయం నుంచి తమకు తిరిగి వచ్చిన ఫైల్‌లో టీవీ చాన ళ్లలో చెప్పిన విషయమే ఉందని కేజ్రీవాల్ చెప్పారు. ఇది తీవ్రంగా తీసుకోవలసిన విషయమని, రాజ్యాంగ సమస్య అని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తోందని కొందరు అంటున్నారని ఆయన చెప్పారు.లెఫ్టినెంట్ గవర్నర్ జన్‌లోక్‌పాల్ బిల్లుపై సొలిసిటర్ జనరల్ సలహా కోరిన విషయం కూడా లీకవడం కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమేనని సీఎం ఆరోపించారు. నిజానికి తాను అంతకు ముందు లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి తాము కూడా బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయమై రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకున్నట్లు చెప్పాలనుకున్నానని, కానీ ఎల్జీ కార్యాలయం నుంచి సమాచారం లీకైన తర్వాత తాను కూడా ఎల్జీకి లేఖ రాసి మీడియా ముందుంచానని సీఎం కేజ్రీవాల్ వివరించారు.
Advertisement