సౌత్‌లో 50+ మావే
- కేంద్రంలో మాదే ప్రభుత్వం
- ఇంతవరకూ ఖాతా తెరవని రాష్ట్రాల్లోనూ సత్తా చాటుతాం
- పదేళ్లలో కాంగ్రెస్ సాధించిన అభివృద్ధి శూన్యం
- అందుకే నేడు వ్యక్తిగత విమర్శలు చేస్తోంది
- ఎన్డీయే హయంలో జోరుగా అభివృద్ధి
- దీనిపై చర్చకు రావాలని పలుమార్లు ‘కాంగ్రెస్’కు ఆహ్వానం
- కుంటిసాకులు చూపుతూ తప్పించుకుంటోంది
- పరమేశ్వర విమర్శలు దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం
- బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు
సాక్షి, బెంగళూరు : దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 132 పార్లమెంటు స్థానాలు ఉండగా.. అందులో 50 కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
దేశ వ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని, ప్రజలందరూ మోడీనే ప్రధానిగా చూడాలని భావిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకూ ఖాతా తెరవని రాష్ట్రాల్లోనూ బీజేపీ తన సత్తాను చాటి మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంటుందని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవాలే కాని, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని అభిప్రాయపడ్డారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ హయాంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం ఉండగా కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ హయాంలో అది 4.8 శాతానికి పడిపోయిందన్నారు. దవ్యోల్బణం (ధరల పెరుగుదల రేటు) 3.77 శాతం ఉండగా, కాంగ్రెస్ పాలనలో అది 9.33 శాతానికి ఎగబాకిందన్నారు. ఎన్‌డీఏ హయాంలో పారిశ్రామిక ఉత్పాదక 6.9 శాతం కాగా, కాంగ్రెస్ ఇలాఖాలో ఇది ‘జీరో’ అన్నారు.
ఇలా ఇరు ప్రభుత్వాల పాలనలోని ఆర్థిక ప్రగతిపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులను తాము ఆహ్వానిస్తున్నా.. ఏవో కుంటి సాకులు చెబుతూ వారు పలాయనం చిత్తగిస్తున్నారని వ్యంగమాడారు. ఆ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా గ్రామీణ న్యాయస్థానాలను స్థాపించలేకపోయిందని, చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేక పోయిందని అన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాజీ ప్రధాని దేవెగౌడపై చేసిన విమర్శలు దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శిం చారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల విషయం మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా ఇదే సందర్భంలో విపక్షాలకు చెం దిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు.