దుకాణంలోకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురి మృతి
Published Wed, Aug 28 2013 3:45 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: తిరుపూర్‌లో అర్ధరాత్రి సమయంలో ఆమ్ని బస్సు సెల్ ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి తిరువనంతపురానికి సోమవారం సాయంత్రం ప్రైవేటు ఆమ్ని బస్సు బయలు దేరింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ధర్మపురి జిల్లా తొరపూరుకు చెందిన రాజ (30) బస్సు డ్రైవర్‌గా ఉన్నాడు. అర్ధ రాత్రి ఒంటిగంట సమయంలో తిరుపూర్ కరుమారం పాళయంలో ఉన్న ఊత్తుకుళి రోడ్డులో బస్సు వెళుతోంది. ఆ సమయంలో వెనుక వస్తున్న బనియన్ కంపెనీ బస్సు ఈ ఆమ్ని బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది.
దీంతో ఆమ్ని బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సెల్‌ఫోన్ దుకాణంలోకి దూసుకువెళ్లింది. అర్ధ రాత్రి సమయం కావడంతో దుకాణం మూసి ఉంది. వేగంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దుకాంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొబైల్ దుకాణానికి సమీపంలో ఉన్న చేపల దుకాణం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు బస్సు ముందు భాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 22 మంది ప్రయాణికులు తీవ్రం గాయపడ్డారు. మృతి చెందిన ప్రయాణికులు కేరళ ఆలంపుళకు చెందిన సాయి యోగ శర్మ (21) అని, చెన్నైకు చెందిన లియో (37) అని తెలిసింది. ఈ సంఘటనపై తిరుపూర్ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.
Advertisement