సాక్షి, ముంబై: ఏ ఇంటి సమీపంలోనైనా చెత్త,కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వస్తువులు పేరుకుపోయినట్లు కనిపిస్తే సదరు ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయీ సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, సొసైటీలు, చాల్స్, మురికివాడలు ఇలా ఎక్కడైన సరే ఇంటి యజమానులను వదిలే ప్రసక్తేలేదని స్థాయీ సమితిలో నిర్ణయించారు.
దోమల సంతతికి ఊతమిచ్చే చెత్త కనిపించినా, దీని కారణంగా ఇరుగు పొరుగువారికి డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు సోకితే సంబంధిత ఇంటి యజమానిని అరెస్టు చేయాలని కమిషనర్లు ఆదేశాలు జారీచేసినట్లు బీఎంసీ ఆస్పత్రుల డెరైక్టర్ డాక్టర్ సుహాసిని నాగ్‌దా చెప్పారు. ఈ ఆదేశాల కారణంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంటి యజమానుల్లో దడపుట్టింది. కొద్ది రోజులుగా నగరంలో డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యాధులు ముఖ్యంగా పరేల్ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమైంది.
పరేల్, లాల్‌బాగ్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్, లోయర్‌పరేల్ ప్రాంతాల్లో మూతపడిన మిల్లు స్థలాల్లో అనేక భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. అక్కడ గుట్టల్లా పేరుకుపోయిన శిథిలాలు, చెత్తచెదారం, రోజుల తరబడి నిల్వ చేసిన నీరు, పనిచేసే కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి అంటువ్యాధులతో రావడం ఇలా అనేక కారణాలవల్ల డెంగీ పడగ విప్పిందని వైద్యులు అంటున్నారు. దీనికి తోడు చాల్స్, భవనాల పరిసరాల్లో కుళ్లిపోయిన ఆహారం, కూరగాయలు పారేయడం వల్ల దోమల బెడద ఎక్కువవుతోందని నాగ్‌దా అన్నారు. ఫలితంగా డెంగీ, మలేరియా, లెఫ్టో లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని, దీంతో బాధ్యులైన ఇంటి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.
‘చెత్త’ యజమానిపై చర్యలు..!
Published Fri, Oct 31 2014 10:26 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement