
అందుకే పేరు మార్చుకున్నా..
పేరులో ఏముంది అనే నాస్తికులు, పేరులోనే అంతా ఉంది అనే ఆస్తికులు ఉన్నారు. దేనికయినా నమ్మకమే కారణం. ఇక తారల విషయానికొస్తే సెంటిమెంట్‌కు ఎక్కువ విలువనిస్తారు.నటి ధన్సిక అదృష్టం వరించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో ఆయన సోదరిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు సాయి ధన్సికగా పేరు మార్చుకున్నారు.కారణమేమిటమ్మా అని అడిగితే తను సాయి భక్తురాలని వివరించారు. అదేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.
నేను అరవాన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. చాలా మనస్తాపానికి గురయ్యాను. అప్పుడు నా స్నేహితురాళ్లు ఒక సారి షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకురా అని చెప్పారు. వెంటనే నేను షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాను. మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. ఆలయం నుంచి బయటకు రాగానే నాకు మనస్తాపాన్ని కలిగించిన వారు ఫోన్ చేసి క్షమాపణ కోరారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పటి నుంచి ఇప్పుడు రజనీకాంత్‌తో నటించే అవకాశం వరకూ అంతా మంచే జరుగుతోంది. అందుకే నా పేరు ముందు సాయిని చేర్చుకున్నాను.