విభజన సెగ ఢిల్లీలోని సీమాంధ్రులకు తాకింది
Published Sun, Aug 18 2013 11:03 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: విభజన సెగ ఢిల్లీలోని సీమాంధ్రులకు తాకింది. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర రగలిపోతోంది. అక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమాలు కొనసాగిస్తుండగా, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు పార్లమెంటును స్తంభింపచేస్తున్నారు. వారి ఆందోళనకు ‘మేం సైతం’ అంటూ సంఘీభావం తెలుపుతూ నగరంలో నివసించే సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు, మహిళలు కదం తొక్కుతున్నారు. గడిచిన మూడు రోజుల నుంచి ఏపీభవన్‌లో సమైక్యాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర ఐక్యత కాంక్షిస్తూ చేస్తున్న ఉద్యమానికి కొనసాగింపుగా ఆదివారం జంతర్ మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఓ వైపు భారీ వర్షంతో నగరం తడిచిముద్దవగా.. ఆందోళనకారులు మాత్రం వెనకడుగు వేయలేదు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హుకుంపై ధ్వజమెత్తారు. ఏపీభవన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన జంతర్ మంతర్ వరకు చేరుకుంది. ‘తెలుగుభాష ఒక్కటేరా.. తెలుగువారంతా ఒక్కటే రా’, ‘విభజన వద్దు ఐక్యత ముద్దు’, ‘మాకు న్యాయం కావాలి’, ‘సమైక్యాంధ్ర కావాలి’ అంటూ నినాదాలు చేశారు.
విభజించి పాలించే విధానం: గల్లా సతీష్, విశాలాంధ్ర మహాసభ ఢిల్లీ కన్వీనర్
ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అవలంబించిన విభజించు పాలించు సూత్రాన్ని కాంగ్రెస్ నేడు అమలు చేస్తోంది. ఇటలీవాసి సోనియాగాంధీ మనదేశానికి వచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం కుమారుడిని ప్రధానిగా చూడడానికి చీలికకు కుట్ర చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక రాష్ట్రం ఉద్యమాలతో అస్తవ్యస్తమయింది. సీమాంధ్రులను తెలంగాణ నాయకులు ఎంతగా ధూషించినా అక్కడ రాజకీయ నాయకులకు పట్టడం లేదు. అలాంటి నాయకులను తరిమికొట్టడానికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అందరం పాటుపడాలి.
పోరాటాలకు సంఘీభావం: బాలకోటేశ్వరరావు (ఏపీ భవన్ సమైకాంధ్ర ఉద్యోగుల జేఏసీ కన్వీనర్)
సమైక్యాంధ్ర కొనసాగాలని రాష్ట్రంలో జరుగుతున్న పోరాటాలకు సంఘీభావంగా ఇక్కడ ఆందోళనకు ఉపక్రమించాం. నాలుగు రోజులుగా ఏపీభవన్‌లో ధర్నాలు చేసి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాం. మా పోరాటాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీలు, నేతల అండలేదు. పార్టీల తరఫున పోరాడడం లేదు. అన్నదమ్ముల్లా జీవిస్తున్న మా మధ్య చిచ్చు పెట్టి విభజన చేస్తామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఎన్నో త్యాగాలకు సిద్ధపడుతున్నారు. కలిసి ఉండాలన్నదే మా ఆకాంక్ష.
విభజన నిర్ణయం తప్పు: లింగరాజు, ఏపీ భవన్ సమైక్యాంధ్ర ఉద్యోగుల జేఏసీ కో కన్వీనర్
విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం చాలా తప్పు. అత్త ఇందిరాగాంధీ మార్గాన్ని వీడి కోడలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం తగదు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని అందరు గ్రహించాలి. మహోన్నత పథకాలతో వైఎస్ రాష్ట్ర పురోభివృద్ధికి పేదల సంక్షేమానికి పాటుపడ్డారు. హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి, పెట్టుబడులు కీలక పాత్ర వహించాయి. విభజనతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. పిల్లల భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది.
విభజన వద్దు: సుజాత (సీమాంధ్ర మహిళ)
నేను తెలంగాణ కోడలిని. మా వారిది వరంగల్. నేను సీమాంధ్ర బిడ్డని. నా కూతురు వరంగల్ వాసి. నా కోడలు తెలంగాణ వాసి. ఇప్పుడు సీమాంధ్రులను వెళ్లిపోవాలంటున్నారు. అంటే మేం ఇప్పుడు ఒకర్నొకరం వదిలేయాలా..? ఇలాంటి వినాశకర వాదనలతో అందరికి చేటు. ఉద్యోగాలని మరేదో చెప్పి రాజకీయం చేస్తున్నారు. ఎవరి సుఖం వారు చూసుకోవడం ఏమిటి..? నేను కేసీఆర్‌ను ఒక్కటే కోరుతున్నా.. ఇలాంటి వాదనలు చేయవద్దు.
సోనియా కూడా వెళ్లాలి: ఎన్. సత్యనారాయణ (ఆంధ్ర సంస్కృతి కేంద్రం అధ్యక్షుడు)
దేశంలో చేసిన అవినీతి, కుంభకోణాలు అన్నింటిని కప్పిపుచ్చుకోడానికి ప్రజాసమస్యలపై నుంచి దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టింది. హైదరాబాదు నుంచి సీమాంధ్రులను వెళ్లమంటున్నారు.. అలాగైతే సోనియా కూడా ఇటలీ వెళ్లిపోవాలి. పార్టీకి ఒక సీఎం పదవి, రాహుల్‌కు ఒక పీఎం పదవి వస్తాయన్న దురుద్ధేశంతో సోనియా రాష్ట్రాన్ని చీల్చుతున్నారు.
ఐకమత్యమే బలం: పార్వతి రెడ్డి, మహిళా మండలి నాయకురాలు
హైదరాబాదులో అన్ని జిల్లాల వారు ఉన్నారు. ఐకమత్యంగా అందరు కలిసి ఉంటుండగా విభజన భావ్యం కాదు. రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఢిల్లీలో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న నేను కూడా హైదరాబాదులోనే స్థిరపడాలని అనుకుంటున్న దశలో రాష్ట్రాన్ని చీల్చి అక్కడ సీమాంధ్రులు ఉండకూడదంటే ఎలా..?
రాజకీయ పన్నాగం: సత్యకుమారి
రాజకీయ పన్నాగంలో భాగంగానే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. తెలుగువారి మనసులను రాజకీయంతో విరగొట్టారు. దేశభాషలందు తెలుగు లెస్స. అలాంటి తెలుగువారంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సుశీల, ఢిల్లీ తెలుగు పూజా సమితి అధ్యక్షురాలు శారద తదితరులు పాల్గొన్నారు.
Advertisement