ఐఏఎస్ మృతిపై అట్టుడికిన సభ
► అనురాగ్ తివారి వ్యవహారంపై చర్చకు బీజేపీ పట్టు
► విధానసభలో ఇరుపక్షాల వాగ్వాదం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక క్యాడర్ యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అనుమానాస్పద మరణం గురువారం విధానసభలో ప్రతిధ్వనించింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ ఆరంభమైన వెంటనే విపక్షాల ఒత్తిడి మేరకు స్పీకర్ కోళివాడ స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వగా, బీజేపీ పక్ష నేత జగదీష్‌శెట్టర్ మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా ఉత్తమ సేవలు అందించిన అనురాగ్ తివారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై చట్టసభల్లో చర్చించాల్సిన అవసరం ఉంది.’ అని డిమాండ్ చేశారు.
స్పీకర్ కోళివాడ స్పందిస్తూ ఈ కేసును ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తుండటం వల్ల చట్టసభలో చర్చించడానికి అవకాశం లేదన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శెట్టర్ గతంలో సీబీఐకు అప్పగించిన పలు కేసులను ఇదే సభలో చర్చించామన్నారు. న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మాట్లాడుతూ బీజేపీ నాయకులు చావును కూడా రాజకీయం చేస్తున్నారని ఘాటు వాఖ్యలు చేశారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించి చట్టసభలో చర్చించడం వల్ల ప్రయోజం ఏమీ ఉండబోదన్నారు.
అనురాగ్ తివారి అనుమానాస్పద విషయం పై చర్చకు అనుమతివ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టారు. ఇందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో విపక్ష బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి ధర్నాకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఒత్తిడికి తలొగ్గిన స్పీకర్ కోడివాళ ఈ విషయమై విషయాన్ని ప్రస్తావించడానికి మాత్రం అవకాశం కల్పించారు.
జగదీ శెట్టర్ మాట్లాడుతూ...‘బాధిత కుటుంబ సభల్యులు ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు. వారిని కనీసం ప్రభుత్వం అధికారికంగా మాట్లాడి
వారికి సాంత్వన చేకూర్చాలి.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరికాదు. అది మానవత్వం అనిపించుకోదు.’ అని పేర్కొన్నారు. చివరకు స్పీకర్ సూచనతో చర్చను ముగించారు.