సినిమా కథలా విగ్రహాల కేసు... | Tamil Filmmaker V Sekar Arrested in Idol Theft Case | Sakshi
Sakshi News home page

సినిమా కథలా విగ్రహాల కేసు...

Published Thu, Aug 20 2015 10:21 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

సినిమా కథలా విగ్రహాల కేసు... - Sakshi

సినిమా కథలా విగ్రహాల కేసు...

చెన్నై: సినిమా దర్శకుడిగా ఉండిన ప్రభావమో ఏమో విగ్రహాల చోరీ కేసులో సైతం అదే రేంజ్ లో ట్విస్ట్ లు నెలకొన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.80 కోట్ల విగ్రహాలను విదేశాలకు తరలించే బండారం..... దర్శకుడు శేఖర్ అరెస్ట్‌తో బట్టబయలు కాగా ఈ కేసు విచారణలో కూడా రోజుకో మలుపు తిరుగుతోంది.
 
పోలీసుల వలలో చిక్కిన దర్శకుడు శేఖర్... వారి వద్ద ఆవిష్కరించిన కథనం ఎంతో ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని పురాతన ఆలయాల్లోని విగ్రహాలకు ఆస్ట్రేలియా తదితర విదేశాల్లో ఉన్న గిరాకీని క్యాష్ చేసుకోవాలని, కొన్ని రోజుల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారాలని నిర్ణయించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు విగ్రహాల అక్రమ రవాణా నిరోధక పోలీసు విభాగం వారికి  అడ్డంగా పట్టుబడ్డారు.
 
 నిందితుల నుండి రూ.80 కోట్ల విలువైన ఎనిమిది విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ అయిన విగ్రహాలను విదేశాలకు చేరవేసేందుకు జయకుమార్ అనే వ్యక్తి బ్రోకర్‌గా వ్యవహరిస్తుంటాడు. సుమా రు రూ.1000 కోట్ల విగ్రహాలను చోరీ చేయాలని జయకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. జయకుమార్‌కు సహాయకులుగా కరుణాకరన్, మారీ, మాలతి, ఎస్‌ఐ రాజేంద్రన్ అనే పిలువబడే వ్యక్తి వ్యవహరించేవారు. వీరంతా కలిసి పు రాతన ఆలయాల్లో విగ్రహాలను ఎలా దొంగలించాలి, ఎలా భద్రం చేయాలి, పోలీసుల కళ్లుకప్పి విదేశాలకు ఎలా తరలించాలనే అంశాలపై ఈ ఏడాది జనవరిలో చర్చించుకున్నారు.
 
 అదే సమయంలో మాలతి ఇంటిలోని ఒక క్యాలెండర్‌లో శ్రీపెరంబూదూర్ సమీపంలోని రామానుజపురం మణికంఠేశ్వర్ ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలు వారిని ఆకర్షించాయి. ముందు ఈ విగ్రహాలను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకంలో భాగంగా దొంగలముఠాకు చెందిన వ్యక్తులు భక్తుల్లా గుడిలోకి వెళ్లి పూజారికి తెలియకుండా సెల్‌ఫోన్‌లో విగ్రహాలను ఫోటో తీసారు. ఆ తరువాత ఇంటికి చేరుకుని క్యాలెండర్‌లో ఉన్న బొమ్మలతో సరిపోల్చుకుని సంతృప్తి చెందారు. ఆ తరువాత విగ్రహాల చోరీపై జయకుమార్ పథక రచన చేశాడు.
 
 ఆలయంలో సీసీ కెమెరాలు లేవని ముందుగా నిర్ధారించుకున్నారు. కొందరు ఆలయం వెలుపల కాపలా కాయగా, మరి కొందరు లోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. అందరూ కలిసి విగ్రహాలతో చెన్నైకి బయలుదేరారు. మార్గమధ్యంలో వాహనాల తనిఖీ జరుగుతుండగా దొంగల గుంపులోని మాలతి తాను విలేకరినని పరిచయం చేసుకుని గుర్తింపు కార్డును కూడా చూపింది. ఎస్‌ఐ రాజేంద్రన్‌గా చలామణి అవుతున్న వ్యక్తి పోలీస్ యూనిఫాంలో విగ్రహాల కారు వెనుకనే అనుసరించి,  ఆ కారులో ఏమీ లేదు, తాను తనిఖీ చేశానని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. దీంతో విగ్రహాలతో క్షేమంగా చెన్నైకి చేరుకుని జయకుమార్ ఇంటిలో భద్రం చేశారు.
 
 అలాగే తిరువణ్నామలై  జిల్లా వందవాసిలో పైయూర్ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారు, శ్రీదేవీ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఇలా రూ.80 కోట్ల విలువైన మొత్తం 8 విగ్రహాలను విదేశాలకు ఎగుమతికి సిద్ధం  చేశారు. అన్ని విగ్రహాలను జయకుమార్ ఇంటిలో జాగ్రత్త చేశారు. విగ్రహాల అమ్మకాల ప్రయత్నంలో సరైన ధర పలకక పోవడంతో జాప్యం చోటుచేసుకుంది. ఎక్కువరోజులు ఒకేచోట ఉంచడం మంచిది కాదని జయకుమార్ ఇంటి నుండి దర్శకుడు వీ శేఖర్ ఇంటికి చేర్చారు.
 
విగ్రహాలు తన ఇంటికి వచ్చినప్పటి నుండి ఆర్థిక నష్టాలు వస్తున్నాయని, వేరే చోటికి తరలించాల్సిందిగా జయకుమార్‌కు  శేఖర్ సూచించాడు. ఇలా అనేక చోట్ల మారుస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో నిందితురాలు మాలతి అప్రూవర్‌గా మారడంతో ఆమె ఇచ్చిన సమాచారంతో ఇతర నిందితుల కోసం తమిళనాడు పోలీసుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement