తమిళానికి పెరుగుతున్న మద్దతు
Published Wed, Sep 18 2013 2:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
కోర్టుల్లో తమిళంలో వాదనలు సాగాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు ఆమరణ దీక్ష చేస్తు న్నారు. వీరికి సంఘీభావంగా మదురై ధర్మాసనం న్యాయవాదులు మంగళవారం దీక్షకు కూర్చున్నారు. దీంతో హైకోర్టులో ఆంక్షల కొరడా అమల్లోకి వచ్చింది.
సాక్షి, చెన్నై: మద్రాస్ హైకోర్టులో తమిళంలో వాదనలకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. న్యాయవాదులు గతంలో సమరభేరి మోగించారు. విధుల్ని బహిష్కరించి ఆందోళనబాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. తమిళ వాదనలకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనికి ఆమోదం కోరుతూ రాష్ట్రపతికి నివేదిక పంపిం ది. అయితే ఇంత వరకు ఆమోదం లభించ లేదు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించాలంటూ న్యాయవాదులు కేంద్రాన్ని పలుమార్లు డిమాండ్ చేశారు. మదురై వేదికగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అయినా ఫలితం శూన్యం.
దీక్షలో న్యాయవాదులు
కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా హైకోర్టు న్యాయవాదులు సోమవారం ఆమరణ దీక్షకు దిగారు. వీరికి సంఘీభావం తెలుపుతూ మదు రై ధర్మాసనంలోని న్యాయవాదులు మంగళవారం ఆమరణ దీక్ష బాట పట్టారు. ఉదయం అక్కడి న్యాయవాదులు ఎలిల్ అరసు, వినోద్, భగవత్ దాసు, సూర్య, దేశి మురుగన్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ ఆమరణ దీక్షలకు మద్దతుగా లా విద్యార్థులు, తమిళాభిమానులు గళం విప్పారు. ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో మద్రాస్ హైకోర్టు, మదురై ధర్మాసనాల్లో ఆంక్షల కొరడా అమల్లోకి వచ్చింది.
ఇవీ ఆంక్షలు
మద్రాస్ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు తమ సంఘ కార్యాలయంలో, మదురై ధర్మాసనం ఆవరణలో అక్కడి న్యాయవాదులు దీక్షలో కూర్చోవడంతో ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్ మేల్కొన్నారు. హైకోర్టు భద్రతను పరిగణనలోకి తీసుకుని అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా హైకోర్టు పరిసరాల్లో శాంతిని పరిరక్షించడం లక్ష్యంగా ఆంక్షలు విధించారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఈ వివరాలను ప్రకటిం చారు. మద్రాస్, మదురై హైకోర్టు ప్రధాన మార్గాలు ఉదయం తొమ్మిది గంటలకు తెరచుకుంటాయని, సాయంత్రం ఆరున్నర గంటలకు మూతపడతాయని ప్రకటించారు. తర్వాత ఏ ఒక్కరూ హైకోర్టు ఆవరణలో ఉండేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.
విధులకు హాజర య్యే న్యాయవాదులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, అన్ని మార్గాల్లో ఉండే భద్రతా సిబ్బందికి వాటిని చూపించాలని ఆదేశించారు. పిటిషనర్లు, బాధితులు, వాద ప్రతివాదులు, సాక్ష్యులు తమ తమ న్యాయవాదుల నుంచి అనుమతి లేఖల్ని తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. లేని పక్షంలో లోపలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దీక్షలోని న్యాయవాదులను రాత్రికి రాత్రే అరెస్టు చేసేనా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ అరెస్టు చేసిన పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చోటు చేసుకున్న విధ్వంసమే ఇందుకు కారణం.
Advertisement