తమిళసినిమా: నటి రమ్యానంభీశన్ కథానాయకిగా నటించిన చిత్రానికి చెన్నై హైకోర్టు బ్రేక్ వేసింది. వివరాలు చూస్తే లిబ్రా ప్రొడక్షన్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన చిత్రం నట్పున్నా ఎన్నన్ను తెరియుమా. నటి రమ్యానంభీశన్ కథానాయకిగా నటించిన ఇందులో కవిన్ కథానాయకుడిగా నటించారు. శివకుమార్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ మలేషియా పాండియన్ అనే డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నట్పున్నా ఎన్నన్ను తెరియుమా చిత్ర విదేశీ విడుదల హక్కులను చిత్ర నిర్మాత నుంచి తాను పొందానన్నారు.
అందుకు అడ్వాన్స్‌గా రూ.8లక్షలు ఇచ్చి ఒప్పందం కూడా చేసుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత పలు మార్లు కొంచెం కొంచెంగా రూ.25లక్షల వరకూ నిర్మాతకు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే నిర్ణయించిన ప్రకారం చిత్రాన్ని విడుదల చేయకపోవడంతో తాను నష్టపోయానన్నారు. దీంతో తన నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని కోరగా నిర్మాత చెల్లించలేదన్నారు. దీనిపై తాను నిర్మాతల మండలిలో, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాబట్టి తన డబ్బు తిరిగి చెల్లించే వరకూ నట్పున్నా ఎన్నన్న తెరియుమా చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం చిత్రాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ విడుదల చేయకూడదంటూ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment