
22న అసెంబ్లీ ?
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీన ప్రారంభం అవుతాయని అనధికార సమాచారం. అయితే ప్రభుత్వాధికారులు బడ్జెట్ సమావేశాలపై తీవ్రస్థాయిలో కసరత్తు జరపడం ఆరంభమైంది.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఏడాది మే 25వ తేదీన తొలి అసెంబ్లీ సమావేశం కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగింది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వకారంతోనే ఆనాటి సమావేశం ముగిసింది. ఆ తరువాత గత నెల 3వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం మరోసారి అసెంబ్లీ సమావేశమైంది. గత నెల 16వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నాలుగురోజుల పాటూ సమావేశాలు సాగాయి.
బడ్జెట్ సమావేశం:ఇదిలా ఉండగా, బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. అయితే బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ఆరంభమయ్యేదీ అధికారిక తేదీ వెల్లడికాలేదు. ఈనెల 22వ తేదీన సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ దాఖలు చేయడం, శాఖల వారిగా మంత్రుల ప్రసంగాలు, జవాబులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అలాగే కొత్త చట్టాలపై బిల్లు దాఖలు చేస్తారని చెబుతున్నారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఇప్పటికే 500 టాస్మాక్ దుకాణాలు ఎత్తివేశారు. మరో వెయ్యి టాస్మాక్‌లకు తాళాలు వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ వెయ్యి టాస్మాక్ దుకాణాలపై సీఎం జయ ఒక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో లోపించిన శాంతి భద్రతలు, నేరాలు, జాలర్ల సమస్య, పాలారు నదీ వివాదం త దితర అంశాలపై రసవత్తరమైన వాదోపవాదాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.