చీరలు కట్టుకుని నిరసన తెలిపారు..
ఢిల్లీ: కరువు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం మళ్లీ వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీరలు కట్టుకుని రహదారులపై నడుస్తూ ‘కరువు సాయం మంజూరు చేయండి’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని వారు తెలిపారు.
కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న నిరసన 32వ రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.