తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది.
కాగా దాదాపు నెల రోజులుగా కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న అన్నదాతలు కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్నరీతిలో ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. రుణమాఫీపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రైతులు గురువారం అరగుండ్లుతో నిరసన తెలిపారు.
గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు నిన్న ఒంటిపై రాతలతో తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.