'బ్రాహ్మణులకూ రిజర్వేషన్లు ఉండాలి'
చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని తమిళనాడు బ్రాహ్మణుల్లోని ఓ వర్గం బలంగా కోరుతోంది. తమ తండ్రులూ, తాతలు చేసిన పాపాలకు తమ పట్ల వివక్ష చూపడం తగదని, సమాజంలో తమకూ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. దళిత పురుషులు బ్రాహ్మణ స్త్రీలను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి లవ్ జిహాద్ నుంచి తమకు రక్షణ కావాలని కోరుతోంది. బ్రాహ్మణ సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు కషి చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. స్థానిక బీజేపీలోని ఓ వర్గంతోపాటు అంతనార్ మున్నేట్ర కళగం (ఏఎంకే) ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. తమకు రాష్ట్రంలో ఇప్పటికే 15 వేల మంది బ్రాహ్మణలు మద్దతు ఉందని పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇక్కడ నిర్వహించిన ఓ సదస్సులో ఏఎంకే నినదించింది. అలాగే అవమానాలు, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో తమను హేళన చేస్తున్నారని ఆరోపించింది. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతురల మధ్య తగువనే వైఖరే విషప్రచారమని, పేద బ్రాహ్మణుడిగా పుట్టడమే నేడు నిజమైన సవాల్ అని మైలాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఈ శేఖర్ అన్నారు. కుల వివక్షత వల్ల నిమ్నవర్గాలు సంఘర్షణకు గురవుతున్న తరుణంలో తాము తమ డిమాండ్లను ముందుకు తీసుకరావడం అసమంజసం ఏమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వాస్తవ పరిస్థితుల ప్రకారం ప్రైవేశ పరీక్షల్లో బ్రాహ్మణ విద్యార్థులకు 99 శాతం మార్కులు వచ్చినా సరిపోవడం లేదని, తమకూ ఆర్థిక న్యాయం జరగాలని, తమ కుటుంబాల ఆర్థిక స్థోమతను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని శేఖర్ కోరారు. తమిళనాడులో నేడు 40 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని, అందరికి సమాన అవకాశాలు కల్పించాలని, నేడు అన్ని రకాలుగా బ్రాహ్మణులను నిర్లక్ష్యానికి, వివక్షకు గురిచేస్తున్నారని, 50,60 ఏళ్ల క్రితం తమ పూర్వులు చేసిన తప్పులకు ఇప్పుడు తమను శిక్షించడం భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులకు నెలకు కనీసం పది వేల రూపాయలను చెల్లించాలని, ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలయాల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల డిమాండ్‌ను తెర ముందుకు తీసుక రావడం ఇదే కొత్త కాదు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు శాతం రిజర్వేషన్లు కావాలని, ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు పది శాతం రిజర్వేషన్లు కావాలంటూ బ్రాహ్మణ నేతలు వారికి మెమోరాండాలు సమర్పించారు.