గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు
న్యూఢిల్లీ: అన్నా డీఎంకేలో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత విషయమని, తమిళనాడు పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయ తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు. జైట్లీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకుండా పోయింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమె స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు సుప్రీం కోర్టు తీర్పును పరిశీలిస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.