శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి బలంగా మద్దతిస్తున్న వారిలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి కూడా ఉన్నారు. ఆమెను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. కానీ ఆయన ఇరవై ఏళ్ల కిందట జయలలిత లక్ష్యంగా పేల్చిన తూటా.. ఇప్పుడు శశికళను కూల్చింది. శశికళ సీఎం కలను కల్లలు చేసి మళ్లీ జైలు పాలు చేసింది.
నిజానికి 1996లో జయలలిత అక్రమాస్తులపై స్వామి (అప్పుడు జనతా పార్టీ అధ్యక్షుడు) ఫిర్యాదు చేసినపుడు అందులో ఆమె పేరు ఒక్కటే ఉంది. శశికళ తదితరుల పేర్లు లేవు. విచారణ కోర్టు తీర్పు ప్రకారం.. 1987లో జయలలిత మొత్తం ఆస్తుల విలువ రూ. 7.5 లక్షలు మాత్రమే. అందులో ఎక్కువ భాగం ఆమె తల్లి ఎన్‌ఆర్ సంధ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులే ఉన్నాయి. అదనంగా రూ. 1 లక్ష నగదు ఉంది. ఆ ఏడాది ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆమె రాజకీయాల్లో పూర్తిగా క్రియాశీలకం అయ్యారు. 1991 ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చారు. కానీ 1996లో జయలలిత ఓడిపోయిన నెల రోజుల్లోనే సుబ్రమణ్యంస్వామి ఆమెపై అవినీతి ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ‘‘జయలలిత 1989-90 లో ప్రకటించిన ఆస్తులు ఏమీలేవు. కానీ ఆమె ముఖ్యమంత్రిగా నెలకు కేవలం 1 రూపాయి వేతనం తీసుకున్నారు. 1990-91లో ఆమె ఆస్తులు రూ. 1.89 కోట్లకు పెరిగాయి. 1991-92 నాటికి రూ. 2.60 కోట్లకు, 1992-93 నాటికి రూ. 5.82 కోట్లకు, 1993-94 నాటికి రూ. 91.33 కోట్లకు, 1994-95 నాటికి రూ. 38.21 కోట్లకు పెరిగాయి’’ అని స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది.
ప్రాథమిక దర్యాప్తు అనంతరం 1996 డిసెంబర్‌లో జయలలితను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె నివాసం పొయెస్ గార్డెన్‌లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శశికళ, ఆమె బంధువుల పాత్రపై కూడా ఆధారాలు లభించాయి. శశికళను రెండో ముద్దాయిగా, ఆమె మేనల్లుడు వి.ఎన్.సుధాకరన్‌ను మూడో ముద్దాయిగా, శశికళ వదిన జె.ఇళవరసిని నాలుగో ముద్దాయిగా ఇదే కేసులో చేర్చారు. 1997 జూన్‌లో నిందితులు నలుగురిపైనా చార్జ్‌షీట్ నమోదు చేశారు. ‘‘ఆరోపిత నేరంలో ఎ2 నుంచి ఎ4 వరకూ పాలుపంచుకున్నారని దర్యాప్తు సందర్భంగా సేకరించిన సాక్ష్యాలు చెబుతున్నాయి’’ అని విచారణ కోర్టు పేర్కొంది. ఆ అభియోగాల నుంచి తమను మినహాయించాలంటూ శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు సమర్పించిన దరఖాస్తులను కోర్టు 1997 అక్టోబర్‌లో తిరస్కరించింది. ఆ ముగ్గురూ రూ. 66.65 కోట్ల అక్రమాస్తులను సంపాదించిన నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నారని, వాటిలో ఎక్కువ భాగాన్ని తమ పేర్లపై కలిగివున్నారని, వారి పేర్లపై 32 వ్యాపారాలను ప్రారంభించారని నేరాభియోగాలు నమోదు చేశారు. అలా ఇరవై ఏళ్ల కిందట జయలలితపై ప్రారంభమైన అవినీతి కేసు విచారణ ఆ తర్వాత శశికళ తదితరులను కూడా నిందితులుగా చేర్చడంతో.. అనేక మలుపుల అనంతరం, జయలలిత కన్నుమూసిన తర్వాత.. మిగతా ముగ్గురినీ జైలుకు పంపించింది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)