దీపా కోసం ప్రయత్నాలు ముమ్మరం
– పోటెత్తుతున్న అభిమానం
– రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి
చెన్నై : జయలలిత మేన కోడలు దీపాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అన్నాడీఎంకే అసంతప్తి నాయకులు, ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ టీ నగర్‌లోని దీపా ఇంటి వద్దకు పోటెత్తుతున్నారు. తన కోసం వస్తున్న వాళ్లను ఆప్యాయంగా నమస్కరిస్తూ దీపా పలకరించి ఓపిక పట్టాలని సూచిస్తున్నారు.
దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీపా తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మేనత్త జయలలితను తలపించే రీతిలో ఆమె వ్యాఖ్యలు, హావాభావాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక, మీడియాతో ఆమె స్పందించే తీరులో జయలలిత పోలికలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు. మేనత్త వారసురాలు తానేనని, రాజకీయాల్లో వస్తానని ఇప్పటికే దీపా స్పందించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న దీప, ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారోనని ఎదురు చూసే వాళ్లూ ఉన్నారు.
చిన్నమ్మ శశికళ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడాన్ని అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ అనేక చోట్ల వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేడర్ దృష్టి ప్రస్తుతం దీపా వైపుగా మళ్లి ఉంది. ఇప్పటికే దీపా పురట్చి మలర్ పేరవై తిరుచ్చి వేదికగా ఏర్పాటు కావడం, అమ్మ డీఎంకే చెన్నై వేదికగా నామకరణం జరగడం వెరసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దీపాను ఆహ్వానించేందుకు తగ్గ ఒత్తిడి పెరుగుతున్నదని చెప్పవచ్చు.
పోటెత్తుతున్న అభిమానం : టీనగర్‌లోని శివజ్ఞానం రోడ్డులో ఉన్న దీపా ఇంటి వద్దకు అభిమాన లోకం పోటెత్తుతున్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అన్నాడీఎంకే అసంతప్తి వాదులు పెద్ద సంఖ్యలో దీపా ఇంటి వైపుగా కదులుతుండడం గమనించాల్సిన విషయం. వచ్చిన వాళ్లందరూ పురట్చి తలైవీ జిందాబాద్ అంటూ అమ్మ నామస్మరణతో నినాదాలిస్తూ మర్మోగిస్తున్నారు. అభిమానం తాకిడి క్రమంగా పెరుగుతుండడంతో అందర్నీ ఆప్యాయంగా దీపా పలకరిస్తూ వస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చే వారిని నమస్కరిస్తూ, ఓపిక పట్టాలని సూచిస్తున్నారు.
ఇక, వచ్చిన వాళ్లందరి పేర్లు, చిరునామాలతో కూడిన వివరాల సేకరణకు పుస్తకాల్ని సైతం అక్కడ ఉంచడం గమనార్హం. మంగళవారం మూడు పుస్తకాల నిండా అభిమాన చిరునామాలు నిండడం విశేషం. ఇక, ఆర్‌కే నగర్ నుంచి ఎన్నికల బరిలో దిగాలని కొందరు నినదిస్తుంటే, మరి కొందరు త్వరితగతిన రాజకీయల్లో రావాలని, అమ్మ ఆశయ సాధనకు నడుం బిగించాలని నినదిస్తున్నారు.