సెల్వం గూటికి మరో ఎమ్మెల్యే, ఎంపీ
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గంలో మరింత ఆందోళన నెలకొంది. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారిన సమయంలో మరో ఎంపీ, ఎమ్మెల్యే చిన్నమ్మ వర్గానికి షాకిచ్చారు. దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్, మదురై ఎంపీ గోపాలకృష్ణన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలికారు.
అనూహ్యంగా సోమవారం రాత్రి సెల్వం వర్గంలో వారిద్దరు చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. పన్నీర్ సెల్వం వారిద్దరికి శాలువా కప్పి ఆహ్వానించారు. దీంతో సెల్వం వర్గంలో ఆనందం రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు 12 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. గత మూడు రోజులుగా శశికళ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు జారుకోవడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఈ రోజు రాత్రికి ఆమె గోల్డెన్ బే రిసార్ట్‌లోనే ఎమ్మెల్యేలతోనే బస చేయనున్నారు. శశికళ రాజకీయ భవితవ్యంపై రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై రాజకీయవర్గాల్లో ఆసక్తిగా నెలకొంది