సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రధాన పార్టీల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి నేటి (సోమవారం)తో సహా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఇప్పటికీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే విషయం అటు రాష్ట్ర నాయకులకే అంతుబట్టడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎవరికి అనుకూలంగా ప్రచారంలో చేయాలో కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే జేడీఎస్ పార్టీ తమ కార్యకర్తలను ఎక్కువ అయోమయంలో పడేస్తోంది. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాలకూ కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా సగానికి సగం మంది చేత నామినేషన్లు వేయించారు. ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశాయి. అయితే జేడీఎస్ మాత్రం ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనేలేదు. ఇప్పటి వరకూ జేడీఎస్ కోసం పనిచేసిన వారికి కాదని ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా దావణగెరెకు కాంగ్రెస్ నుంచి టికెట్టు ఆశించి భంగపడిన మహిమా పాటిల్‌ను అదేస్థానంలో జేడీఎస్ తరఫున పోటీ చేయించనున్నామని జేడీఎస్ నాయకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఆ స్థానంపై కన్నేసిన ఓ మైనారిటీ జేడీఎస్ నేత అనుచరులు ఏమి చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ బెంగళూరు సెంట్రల్ నుంచి జేడీఎస్ తరఫున బరిలో దిగనున్నట్లు పార్టీ నాయకులు ఘంటాపథంగా చెబుతుండగా షరీఫ్ కాంగ్రెస్‌ను వీడబోరని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
దీంతో ఒక వ్యక్తి గురించి రెండు పార్టీల అధినాయకులు పరస్పర విరుద్ధంగా చెప్పుతుండటం ఇరు పార్టీల కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. చిక్కబళాపుర నుంచి కుమారస్వామి పోటీచేసే విషయంపై ఆయనతోపాటు ఆయన తండ్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కూడా ఇప్పటికీ ఓ అవగాహనకు రాలేకపోవడం పట్ల ఆ ప్రాంత జేడీఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆ రెండు పార్టీల్లోనూ అంతే..
టికెట్ల కేటాయింపులో అటు బీజేపీలోనూ ఇటు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. బీదర్ పార్లమెంటు టికెట్టును బీజేపీ ఖూబాకు ఇచ్చింది. కేజేపీ వదలి మొదటి నుంచి ఆ టికెట్టుపై కన్నేసిన సూర్యకాంత్ నాగమారపల్లి ఇప్పటికీ తానే నామినేషన్ దాఖలు చేస్తానని ఇందుకు యడ్యూరప్ప సాయం చేస్తారని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో అక్కడి బీజేపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.
ముఖ్యంగా మండ్య టికెట్టు దక్కించుకున్న రమ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అంబరీష్ అనుచరులను చులకన భావనతో చూస్తున్నారని అందువల్ల ఆమెను పోటీ నుంచి తప్పించనున్నారని కేపీసీసీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై రమ్యతో మాట్లాడి ఒప్పించడానికే ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆమెకు సూచించారని ఆ వర్గం చెబుతోంది. అలాంటిది ఏమీ లేదని ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడటానికేనని మరో వర్గం చెబుతోంది.
శివమొగ్గ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించి భంగపడిన కుమార బంగారప్ప ఈనెల 26లోపు తనకు టికెట్టు ఇవ్వక పోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే అలాంటిది ఏమీ జరగదని ముఖ్యమంత్రి చెబుతుండటంతో అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు కుమార బంగారప్ప అనుచరులు కూడా అయోమయంలో పడ్డారు.
ఇలా కేపీసీసీ నాయకులే విభిన్న ప్రచారం చేస్తుండటంతో క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. నామినేషన్లు వేయడానికి పట్టుమని మూడురోజులే ఉన్న సమయంలో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల విషయంలో ఇంత గందరగోళం ఉండటం వారి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయోమయం
Published Mon, Mar 24 2014 3:00 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement